Let's talk: editor@tmv.in
సంగీత దర్శకుడు రమేష్ వినాయకంతో మోడీ భేటీ

సంగీత దర్శకుడు రమేష్ వినాయకంతో మోడీ భేటీ

Pinjari Chand
5 ఏప్రిల్, 2026

తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ శనివారం ప్రముఖ సంగీత దర్శకుడు రమేష్ వినాయకంను చెన్నైలో కలిసి సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకం అభివృద్ధి చేసిన గమక బాక్స్ నోటేషన్ సిస్టమ్ గురించి ప్రధాని తెలుసుకున్నారు. భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసే వినూత్న పద్ధతిగా ఈ వ్యవస్థను ఆయన ప్రశంసించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పంచుకున్న మోడీ, భారతీయ సంగీతాన్ని ప్రజాదరణ పొందేలా చేయడానికి వినాయకం జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. గమక బాక్స్ నోటేషన్ సిస్టమ్ ద్వారా భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి చేరువ చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.

2009లో రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా భారతీయ సంగీతాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో సమన్వయం చేసి సంరక్షించవచ్చని వినాయకం వివరించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్ సాయంతో భారతీయ సంగీతానికి పూర్తి డిజిటల్ డేటాబేస్ రూపొందించవచ్చని తెలిపారు. సంగీత సమావేశంలో వినాయకం మార్గదర్శకత్వంలో మోడీ టాబ్లెట్‌పై వందేమాతరాన్ని వాయించేందుకు ప్రయత్నించారు. మోడీ ఉత్సాహాన్ని ప్రశంసించిన వినాయకం, మీరు ఉత్తమ విద్యార్థి అంటూ అభినందించారు. సంగీతాన్ని నేర్చుకునే వారికి ఇవ్వడం తన సంప్రదాయమని చెబుతూ వినాయకం మోడీకి పెన్సిల్‌, రబ్బర్‌, ఖాళీ మాన్యుస్క్రిప్ట్ బహుమతిగా అందించారు. అనంతరం ఆయన భక్తి గీతాన్ని ఆలపించగా ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 23న ఒకే దశలో జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మోడీ చెన్నై పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.