
సంగారెడ్డి బైపాస్ రోడ్డులో ఐదు అత్యాధునిక జంక్షన్ల ఏర్పాటు
సంగారెడ్డి పట్టణ అభివృద్ధిలో భాగంగా బైపాస్ రోడ్డు సుందరీకరణ పనులు వేగవంతం అవుతున్నాయి. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి, బైపాస్ రోడ్డులో ఐదు కీలక జంక్షన్ల ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు. సుమారు రూ. 13 కోట్లతో చేపడుతున్న బైపాస్ రోడ్డు విస్తరణ పనులను పర్యవేక్షించిన జగ్గారెడ్డి, ఐబి గెస్ట్ హౌస్ నుంచి బసవేశ్వర చౌక్ వరకు ఐదు చోట్ల జంక్షన్లను ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఐబి జంక్షన్, ఆర్డీవో క్యాంప్ ఆఫీస్ సర్కిల్ వద్ద పర్యటించి, వాటి డిజైన్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
జంక్షన్లు కేవలం రాకపోకలకే పరిమితం కాకుండా, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా ఆకర్షణీయంగా ఉండాలని జగ్గారెడ్డి సూచించారు. జంక్షన్ల డిజైన్లలో పచ్చదనానికి, సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని కన్సల్టెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. జంక్షన్ల ఏర్పాటు సమయంలో వాహనదారులకు, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రహదారి విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, సాధ్యమైనంత త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, హెచ్‌ఎండీఏ ఇంజనీర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సంగారెడ్డి పట్టణ రూపురేఖలు మారిపోవడమే కాకుండా, ప్రయాణం మరింత సులభతరం కానుంది.
