
సంగారెడ్డి పేదలందరికీ 80 గజాల ఇంటి స్థలం: జగ్గారెడ్డి భరోసా
సంగారెడ్డి మున్సిపాలిటీలో 2012–13లో ఇళ్ల పట్టాలు పొందిన వారు, అలాగే ఇప్పటికీ ఇంటి స్థలం లేని పేదలతో సంగారెడ్డి గంజ్ మైదాన్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కిరాయి ఇళ్లలో ఉండే వారి కష్టాలు తనకు బాగా తెలుసన్నారు. తాను కూడా 22 సంవత్సరాలు కిరాయి ఇంట్లోనే జీవించానని, అందుకే ప్రతి పేదవాడికి సొంత ఇంటి జాగ ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి సంగారెడ్డిలో 5,500 మంది పేదలకు 80 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇప్పించానని గుర్తు చేశారు. అయితే అప్పట్లో అలియాబాద్, తోగర్‌పల్లిలో ఇచ్చిన స్థలాలను బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇతర అవసరాలకు ఉపయోగించారని ఆరోపించారు. ఆ స్థలాల గురించి పదేళ్లలో ఒక్కరైనా ప్రశ్నించలేదా అని ప్రజలను ప్రశ్నించారు.
ఇప్పుడు మళ్లీ సంగారెడ్డి, కంది మండలాల్లో 200 ఎకరాల భూమి సేకరణకు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్లు తెలిపారు. ఈ జనవరి నుంచే ప్రక్రియ ప్రారంభించి, వచ్చే నవంబర్ నాటికి ఒక కొలిక్కి తీసుకువస్తానని, భూసేకరణ పూర్తయ్యాక మరోసారి సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. సర్టిఫికెట్లు లేనివారు కూడా మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వెయ్యి నోటు, క్వార్టర్ సీసాకు జీవితాలను పణంగా పెట్టవద్దని హెచ్చరించారు. నెలకు రూ.5,000 కిరాయి చెల్లిస్తే ఏడాదికి రూ.60 వేలు, పదేళ్లకు రూ.6 లక్షలు నష్టపోయారని చెప్పారు. తనను ఓడించారని ఎప్పుడూ బాధపడలేదని, అది ఒక రకంగా మంచిదే జరిగిందని జగ్గారెడ్డి అన్నారు. తాను ఎన్నికల్లో ఓడిపోవడం వల్లే తన భార్య నిర్మల కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల పాటు ప్రజలకు సహాయం చేస్తూ పైసలు పంచుతానని, ఆ సమయంలో తన దగ్గర డబ్బులు ఉంటాయని చెప్పారు.
అయితే ఎన్నికల సమయంలో మాత్రం తన దగ్గర డబ్బులు ఉండవని, అదే తన శాపమని వ్యాఖ్యానించారు. ఇతరుల్లా ఓటుకు వెయ్యి రూపాయలు ఇవ్వాలంటే ఇవ్వగలనని, కానీ అలాంటి ఆలోచన తన స్వభావం కాదని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉందని, సీఎం రేవంత్ రెడ్డి తన మాట వింటారని తెలిపారు. చివరగా సంగారెడ్డిలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి 80 గజాల స్థలం ఇస్తానని జగ్గారెడ్డి మాట ఇచ్చారు.
