Let's talk: editor@tmv.in
సంగారెడ్డి జిల్లా పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి దామోదర్ శ్రీకారం

సంగారెడ్డి జిల్లా పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి దామోదర్ శ్రీకారం

Gaddamidi Naveen
21 జనవరి, 2026

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పర్యటనలో సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించారు.

సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి 254 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం రూ.2 కోట్ల 54 లక్షల 29 వేల 464 రూపాయల విలువైన ఈ చెక్కులు పేద కుటుంబాల వివాహ అవసరాలకు ఆర్థిక భరోసాగా నిలవనున్నాయని మంత్రి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఆయన తెలిపారు.

అనంతరం సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల బలోపేతానికి సంబంధించిన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం రూ.31 కోట్ల 70 లక్షల వ్యయంతో చేపట్టనున్న వివిధ పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. హెచ్‌ఎండీ నిధులతో రూ.8 కోట్ల వ్యయంతో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులు, సీడీఎంఏ నిధులతో రాజీవ్ పార్క్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ పథకం కింద రూ.18.70 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పనులు చేపట్టనున్నారు. అదనంగా హెచ్‌ఎండీఏ నిధులతో రూ.2 కోట్ల వ్యయంతో రాజంపేట నుంచి హాస్టల్ గడ్డ వరకు సీసీ రోడ్డు నిర్మాణం, ఫిల్టర్ బెడ్ మరమ్మత్తుల పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు.

రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, చెత్త నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడితే పట్టణాలు శుభ్రంగా, సురక్షితంగా మారుతాయని అన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీని అభివృద్ధి పరంగా ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

ఆందోల్‌లో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ

జోగిపేట శ్రీరామ్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆందోల్–జోగిపేట పట్టణ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జోగిపేట–ఆందోల్ ప్రాంతానికి చెందిన 327 మహిళా సంఘాలు పాల్గొనగా, సుమారు 3,400 మంది సభ్యులు లబ్ధి పొందారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళా సంఘాలకు సమావేశాలు నిర్వహించేందుకు, కార్యకలాపాలు విస్తరించేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించే దిశగా జోగిపేట, ఆందోల్ ప్రాంతాల్లో మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి రూ.4 కోట్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.

మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో స్వయం సహాయక సంఘాల పాత్ర ఎంతో కీలకమని మంత్రి పేర్కొన్నారు. మహిళా సంఘాల ఉద్యమానికి బీజం వేసిన మహానేత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఈ సందర్భంగా ఆయన స్మరించారు. ఆయన పాలనలో మండల సమాఖ్యలకు రూ.50 లక్షల నిధులు, పావలా వడ్డీ రుణాల పథకాన్ని ప్రవేశపెట్టి, రుణాలు సమయానికి చెల్లించే సంస్కృతిని నెలకొల్పారని తెలిపారు. అనంతరం 2013లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వడ్డీ లేని రుణాల పథకాన్ని కొనసాగించారని, 2023లో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఈ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తోందని, దాదాపు రూ.40 వేల కోట్ల రుణాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. అందోల్ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటైతే స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, మహిళలకు నాణ్యమైన చీరలు, సన్నబియ్యం సరఫరా, ఆర్టీసీ బస్సుల సౌకర్యాల మెరుగుదల వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.