Let's talk: editor@tmv.in
సంగారెడ్డి జిల్లాలో జ్యోతిబా పూలే విగ్రహం ధ్వంసం: అమిత్ షా జోక్యం కోరిన మంత్రి ఛగన్ భుజబల్

సంగారెడ్డి జిల్లాలో జ్యోతిబా పూలే విగ్రహం ధ్వంసం: అమిత్ షా జోక్యం కోరిన మంత్రి ఛగన్ భుజబల్

Gaddamidi Naveen
9 ఫిబ్రవరి, 2026

తెలంగాణలో సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజబల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక విగ్రహంపై జరిగిన దాడి కాదని, సామాజిక సమానత్వ భావజాలంపై జరిగిన దాడి అని ఆయన అభివర్ణించారు.

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో తెల్లాపూర్ గ్రామంలో ఫిబ్రవరి 6న చోటుచేసుకుంది. జ్యోతిబా పూలే విగ్రహాన్ని అగంతకులు అగౌరవపరచడం స్థానికంగా పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు భుజబల్ లేఖ రాశారు.

మహాత్మా ఫూలే వంటి మహనీయుల విగ్రహాలను లక్ష్యంగా చేసుకోవడం అనేది ప్రగతిశీల సామాజిక ఆలోచనలపై దాడి చేయడమేనని ఆయన పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఫూలే చేసిన సేవలు అమూల్యమని తెలిపారు. అలాంటి మహానుభావుడి వారసత్వాన్ని అవమానించే చర్యలను ప్రజాస్వామ్య సమాజంలో సహించరాదని ఆయన అన్నారు.

ఈ ఘటన వెనుక ఉన్న నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని భుజబ‌ల్ డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఉదాహరణాత్మక శిక్షలు విధించాలని సూచించారు. రాజ్యాంగ విలువలను కాపాడటం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. మహాత్మా ఫూలే సమాజంలో సమానత్వం, విద్యా ప్రాధాన్యత, సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచారని, ఆయనపై జరిగే అవమానకర చర్యలు సమాజానికి మంచిది కాదని భుజబ‌ల్ స్పష్టం చేశారు.