Let's talk: editor@tmv.in
సంగారెడ్డిలో పోలింగ్ ఆపేస్తా... సీఐపై ఆవేశంతో ఊగిపోయిన జగ్గారెడ్డి

సంగారెడ్డిలో పోలింగ్ ఆపేస్తా... సీఐపై ఆవేశంతో ఊగిపోయిన జగ్గారెడ్డి

Gaddamidi Naveen
12 ఫిబ్రవరి, 2026

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సంగారెడ్డిలో హైడ్రామా చోటుచేసుకుంది. 34వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిపై పోలీసులు దాడి చేస్తున్నారన్న సమాచారంతో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒక్కసారిగా పోలింగ్ బూతు వద్దకు చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న సీఐ అభ్యర్థి గల్లా పట్టుకోవడంతో ఆగ్రహించిన జగ్గారెడ్డి, పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.

పోలింగ్ కేంద్రం లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేసిన జగ్గారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు, జగ్గారెడ్డి అనుచరుల మధ్య తోపులాట జరిగింది. ఎవడ్రా నువ్వు.. నిన్ను వదిలిపెట్టను అంటూ జగ్గారెడ్డి సీఐపై నిప్పులు చెరిగారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి రిగ్గింగ్‌కు పాల్పడుతుంటే సీఐ స్వయంగా సహకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రిగ్గింగ్ జరుగుతున్న చోట పోలింగ్ తక్షణమే ఆపేయాలని, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. పోలింగ్ ఆపేస్తా ఇక్కడ అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను అంటూ ఆయన బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదనపు బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి.