
సంక్షోభంలోకి ఆక్వా రంగం .. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ధ్వజం
తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆక్వా రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఫీడ్ ధరలు, విద్యుత్ చార్జీలు, నాణ్యమైన సీడ్ సరఫరాపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోయిందని విమర్శించారు. తక్షణమే ఆక్వా రైతులను ఆదుకోకపోతే న్యాయపోరాటంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆక్వా ఫీడ్ ధరలు నాలుగుసార్లు పెరిగాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో టన్ను ఫీడ్ ధర సుమారు రూ.80 వేలుగా ఉండగా.. ప్రస్తుతం రూ.1.20 లక్షలకు చేరిందని తెలిపారు.
విద్యుత్ చార్జీలతో అదనపు భారం
ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఆక్వా రైతులపై పవర్ ఫ్యాక్టర్, ఓవర్‌లోడ్ చార్జీల భారాన్ని మోపుతోందని ప్రసాదరాజు ఆరోపించారు. దీనివల్ల రైతుల ఉత్పత్తి వ్యయం మరింత పెరిగి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సీడ్ క్వారంటైన్ కేంద్రాల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో నాసిరకం సీడ్ మార్కెట్‌లోకి వస్తోందని ఆరోపించారు. దీనివల్ల ఆక్వా చెరువుల్లో వ్యాధులు ప్రబలడంతో రైతులు భారీగా నష్టపోతున్నారని తెలిపారు.
వైసీపీ హయాంలో అనేక చర్యలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించామని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఎస్‌ఏడీఏ) చట్టాన్ని తీసుకురావడంతోపాటు ఆక్వా అసిస్టెంట్లను నియమించామని చెప్పారు. సమగ్ర ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసి, పశ్చిమగోదావరిలో ఆక్వా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు.
ఏపీఎస్‌ఏడీఏ చట్టాన్ని బలహీనపరిచారు
ఏపీఎస్‌ఏడీఏ మాజీ వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం జీఓ నంబర్ 180 ద్వారా ఏపీఎస్‌ఏడీఏ చట్టాన్ని బలహీనపరిచిందని ఆరోపించారు. ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, సిండికేట్లు రైతులను దోచుకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. పెరుగుతున్న భారాన్ని ఆయన ‘సీఎల్‌పీ ట్యాక్స్’గా అభివర్ణించారు. పవర్ ఫ్యాక్టర్ నిబంధనల పేరుతో రైతులపై రూ.1,400 కోట్ల భారం పడుతోందని ఆరోపించారు. విద్యుత్ సబ్సిడీగా రూ.1,200 కోట్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. జూన్ నుంచి ఇప్పటివరకు ఆ మొత్తం ఎంత మేరకు రైతులకు చేరిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
మూడు ప్రధాన డిమాండ్లు
ఆక్వా ఫీడ్ ధరలను తక్షణమే తగ్గించాలని, పవర్ ఫ్యాక్టర్ నిబంధనలను ఉపసంహరించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఆక్వా రంగంపై సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థను పునరుద్ధరించాలని కోరారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు న్యాయపరమైన, రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
