
సంక్రాంతి సంబరాలు 2026: ఆకాశంలో పతంగుల విన్యాసాలు
హైదరాబాద్‌లో సంక్రాంతి 2026 వేడుకలను ప్రపంచ స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ పర్యాటక శాఖ సిద్ధమైంది. సంస్కృతి, రంగులు, వంటకాల వైవిధ్యం, ఆధునిక సాంకేతికత మేళవింపుతో జనవరి 2026లో మూడు మెగా ఫెస్టివల్స్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ వేడుకలు హైదరాబాద్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మరింత ఆకర్షణీయంగా మార్చనున్నాయి.
అంతర్జాతీయ గాలిపటాలు & స్వీట్ల ఫెస్టివల్ 2026 జనవరి 13 నుంచి 15 వరకు (మకర సంక్రాంతి సందర్భంగా) సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగనుంది. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, కెనడా, శ్రీలంక, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, రష్యా, ఉక్రెయిన్ తదితర 19 దేశాల నుంచి గాలిపటాల నిపుణులు పాల్గొననున్నారు. మొత్తం 40 మంది అంతర్జాతీయ, 15 భారతీయ రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ గాలిపటాల కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. మూడు రోజులు ప్రత్యేకంగా రాత్రి గాలిపటాల ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.
ఈ సందర్భంగా తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు, 100కు పైగా హ్యాండ్లూమ్–హస్తకళల స్టాళ్లు, 60 ఫుడ్ కోర్టుల్లో తెలంగాణతో పాటు అంతర్జాతీయ వంటకాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా అంతర్జాతీయ స్వీట్ల ఫెస్టివల్ కూడా నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైదరాబాదీ కుటుంబాలు తయారు చేసిన 1,200కు పైగా రకాల స్వీట్లు ప్రదర్శనలో ఉంటాయి. ఇది గ్లోబల్ ప్రతీకగా నిలవనుంది.
జనవరి 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్–2026 నిర్వహించనున్నారు. యూరప్ నుంచి వచ్చిన 15 అంతర్జాతీయ ప్రమాణాల హాట్ ఎయిర్ బెలూన్లు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉదయపు విమాన ప్రయాణాలు నిర్వహిస్తాయి. సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో నైట్ గ్లో బెలూన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.చెరువుల పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హైడ్రా ఆద్వర్యంలో పునరుజ్జీవింపజేసిన బాగ్ అంబర్ పేటలోని బతుకమ్మ కుంట, కూకట్ పల్లిలోని నల్ల చెరువు, మాదాపూర్ లోని తమ్మిడికుంట, రాజేంద్రనగర్ లోని నేషనల్ పోలీస్ అకాడమీ సమీపంలోని బమ్ రుకున్ ఉద్ దౌలా చెరువుల వద్ద పతంగుల పండగ నిర్వహిస్తారు.
అలాగే జనవరి 16, 17 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ షో 2026 జరగనుంది. బహురంగ ఎల్ఈడీ లైట్లతో హైటెక్ డ్రోన్లు,ఎఫ్పీవీ డ్రోన్ రేసింగ్, డ్రోన్ సాకర్, వైమానిక విన్యాసాలతో భారతదేశం, తెలంగాణ ప్రయాణాన్ని అద్భుతంగా ప్రదర్శించనున్నారు. ఈ మూడు మహోత్సవాలతో సంక్రాంతి 2026ను తెలంగాణ పర్యాటక శాఖ ప్రపంచానికి గుర్తుండిపోయేలా జరపనుంది.
