Let's talk: editor@tmv.in
సంక్రాంతి రద్దీతో ఏపీఎస్‌ఆర్‌టీసీ సరికొత్త రికార్డు

సంక్రాంతి రద్దీతో ఏపీఎస్‌ఆర్‌టీసీ సరికొత్త రికార్డు

Panthagani Anusha
21 జనవరి, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) ఇప్పటివరకు లేని విధంగా ఒక కొత్త రికార్డును సాధించింది. సంక్రాంతి పండుగ అనంతరం ప్రయాణికుల తిరుగు ప్రయాణాల రద్దీ నేపథ్యంలో జనవరి 19న ఒక్కరోజే రూ.28 కోట్లకు చేరువైన ఆదాయం సాధించి ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా 56 లక్షలకుపైగా ప్రయాణికులు ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణించారు.

సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత స్వగ్రామాల నుంచి ఉద్యోగాలు, విద్యాసంస్థలు, వ్యాపార కేంద్రాలకు తిరిగి వెళ్లే ప్రయాణికుల భారీ రద్దీ ఈ రికార్డు సాధనకు ప్రధాన కారణంగా నిలిచింది. ప్రైవేటు వాహనాలు పండుగ వేళల్లో చార్జీలు పెంచినప్పటికీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా సాధారణ చార్జీలకే నడిపి ప్రయాణికుల ఆదరణ పొందింది.

జనవరి 19న సంస్థ రూ.27.68 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయగా, ఇది ఇప్పటివరకు ఏ ఒక్క రోజులోనూ నమోదు కాని అత్యధిక ఆదాయమని అధికారులు తెలిపారు. తక్కువ చార్జీలు, విస్తృత బస్సు సర్వీసులు, సకాలంలో బస్సుల నిర్వహణ వల్ల ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ బస్సులనే ఎంచుకున్నారని వెల్లడించారు.

ఈ ఘనతకు డ్రైవర్లు, కండక్టర్లు, డిపో మేనేజర్లు, ట్రాఫిక్ సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అన్ని స్థాయిల్లోని సిబ్బంది సమన్వయంతో చేసిన కృషే కారణమని ఏపీఎస్‌ఆర్‌టీసీ యాజమాన్యం పేర్కొంది. ముందస్తుగా అదనపు బస్సులను మోహరించడం బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రయాణికుల రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరాన్ని బట్టి తక్షణమే అదనపు సర్వీసులు కేటాయించడం వంటి చర్యలు ఫలితాన్ని ఇచ్చాయని అధికారులు తెలిపారు.

గత రికార్డుల వివరాలు ఇలా…

ప్రస్తుత ఆల్‌టైమ్ రికార్డుకు ముందే సంక్రాంతి పండుగ సీజన్లలో ఏపీఎస్‌ఆర్‌టీసీ పలుమార్లు అత్యధిక ఆదాయాలను నమోదు చేసింది. జనవరి 2025లో ఒకే రోజులో సుమారు రూ.23.71 కోట్ల ఆదాయం సాధించి అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. అంతకుముందు, జనవరి 18, 2023న సంక్రాంతి రద్దీ సమయంలో సుమారు రూ.23 కోట్ల ఆదాయం నమోదైంది. అదేవిధంగా 2022 వేసవి సెలవుల సమయంలో ఒక్కరోజే రూ.18.33 కోట్ల ఆదాయం నమోదు కావడం అప్పట్లో అత్యధికంగా నమోదయిన ఆదాయంగా పరిగణించారు.

ఆదాయం పెరుగుదల

కాగా 2022లో రూ.18.33 కోట్లు, 2023లో రూ.23 కోట్లు, 2025లో రూ.23.7 కోట్లు, 2026లో రూ.27.68 నుంచి రూ.28 కోట్ల వరకు చేరి చరిత్రాత్మక ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో ప్రతి ఏడాది పండుగల సమయంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు, ఏపీఎస్‌ఆర్‌టీసీ ఆదాయం కూడా నిరంతరం పెరుగుతూ వస్తోందని అధికారులు తెలిపారు. తాజా రికార్డు సంస్థకు ఆర్థికంగా కీలక మైలురాయిగా నిలిచిందని రానున్న రోజుల్లో సేవల నాణ్యతను మరింత మెరుగుపరచేందుకు ఇది బలమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఏపీఎస్‌ఆర్‌టీసీ స్పష్టం చేసింది.