Let's talk: editor@tmv.in
సంక్రాంతికి సొంత ఊరు రా! ….రమ్మని పిలిచే..

సంక్రాంతికి సొంత ఊరు రా! ….రమ్మని పిలిచే..

Dantu Vijaya Lakshmi Prasanna
14 జనవరి, 2026

తెలుగు వారి హృదయాల్లో సంక్రాంతి అనేది కేవలం ఒక పండుగ కాదు. అది ఒక ఋతువు. ఒక భావోద్వేగం. ఒక జ్ఞాపకం. ఒక బంధం. కాలం ఎంత ముందుకు పరుగెత్తినా, జీవితం ఎంత మారినా, సంక్రాంతి రాగానే మనసు మాత్రం ఎప్పటికీ మారని దారినే వెతుక్కుంటుంది, అదే పల్లె దారి, ఊరు దారి. భోగి, మకర సంక్రాంతి, కనుమ… ఈ మూడు రోజుల కలయికే తెలుగు జీవన సారాన్ని, సంస్కృతిని, మన మూలాలను అద్దంలా చూపిస్తుంది.

సంవత్సరం పొడవునా ఉద్యోగాలు, చదువులు, బాధ్యతలతో పట్టణాల్లో బిజీగా జీవించే వారు కూడా సంక్రాంతి రాగానే ఒక్కసారిగా నెమ్మదిస్తారు. రైలు టిక్కెట్లు దొరుకుతాయా? బస్సులో చోటు దొరుకుతుందా? సెలవులు సరిపోతాయా? అనే ఆలోచనలతో పాటు, “ఈసారి అయినా ఊరికి వెళ్లాలి” అనే తపన ప్రతి ఇంట్లో వినిపిస్తుంది. ఆ తపనే సంక్రాంతి గొప్పతనం. అది మనల్ని తిరిగి మన మూలాల వైపు నడిపిస్తుంది.

భోగి ఉదయం… చలికాలపు చివరి దశలోని ఆ మబ్బుల ఉదయం. పల్లెల్లో భోగి మంటలు వెలిగిన క్షణం నుంచి పండుగ ఊపిరి పీల్చుకుంటుంది. ఇంటి ముందు మంటల చుట్టూ చేరిన కుటుంబ సభ్యులు, పెద్దల మాటలు, చిన్నారుల నవ్వులు, ఆవిరి ఎగసే చలిలో మంటల వేడి… ఇవన్నీ కలిసి ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి. భోగి అనేది పాతదనాన్ని వదిలి కొత్తదనాన్ని ఆహ్వానించే పండుగ. పనికిరాని వస్తువులనే కాదు, మనసులో పేరుకుపోయిన భారాన్ని కూడా అగ్నికి అర్పించినట్టే ఈ ఆచారం.

భోగి మంటల వేడి శరీరానికే కాదు, మనసుకూ వెచ్చదనాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతుంటారు. పట్నం నుండి పిల్లలొస్తారని ముందుగా చేసిపెట్టిన గోపిడకల దండలుగా కూర్చి పెట్టడం, ఆ దండలు భోగి మంటల్లో పిల్లలతో వేయించి మురిసిపోవడం, పిల్లలతో ఆ మంటల చుట్టూ కూర్చుని చెప్పుకునే కబుర్లు, పాత జ్ఞాపకాలు, కుటుంబ కథలు… ఇవన్నీ తరాల మధ్య వారధిలా పనిచేస్తాయి. ఇంటి ఆవరణలో వేయించే ముగ్గులు, గొబ్బెమ్మలు భోగికి ప్రత్యేక శోభ. ఆడపిల్లల చేతుల్లో రంగులు నాట్యమాడతాయి. ప్రతి ముగ్గు ఒక కళాఖండంలా, ఒక ఆశయంలా కనిపిస్తుంది.

భోగి రోజున కొత్త బట్టలు, ఇష్టమైన పిండి వంటకాలు, గారెలు, బూరెలు, అరిసెలు… ఇవన్నీ పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో భోగి మరింత ఉత్సాహంగా జరుపుకుంటారు. పాటలు, ఆటలు, మంటల చుట్టూ సంబరాలు… కుటుంబ ఐక్యతను, గ్రామీణ జీవన పరిమళాన్ని గుర్తు చేసే రోజు భోగి.

భోగి పండుగ రోజు భోగిపళ్లు వేడుక తెలుగు సంక్రాంతి సంబరాల్లో పిల్లలకే అంకితమైన మధురమైన సంప్రదాయం. భోగి రోజున చిన్నారుల తలపై రేగుపళ్లు, చెరకు ముక్కలు, పూల రేకులు, నాణేలు పోస్తూ పెద్దలు ఆశీర్వదించడం ఈ ఆచారం. పిల్లలు జీవితంలో ఎత్తుకు ఎదగాలి, పండులా పక్వతను, చెరకులా మాధుర్యాన్ని పొందాలి అనే ఆకాంక్షే దీనిలో అంతర్లీనంగా ఉంటుంది. పల్లెల్లో భోగిపళ్ల వేడుక ఒక పండుగలాంటిదే. బంధువులు, ఇరుగుపొరుగు మహిళలు చేరి పాటలు పాడుతూ, నవ్వుల మధ్య చిన్నారుల భవిష్యత్తుకు శుభాకాంక్షలు పలుకుతారు. భోగిపళ్లు ద్వారా తరతరాలుగా వస్తున్న ఆశీర్వాదాల పరంపర, కుటుంబపు అనుబందాన్ని ప్రతిబింబిస్తుంది.

భోగి తర్వాత వచ్చే మకర సంక్రాంతి తెలుగు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన రోజు. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ఈ శుభ ఘడియతో ఉత్తరాయణం ప్రారంభమవుతుందని హిందూ సంప్రదాయం చెబుతుంది. ప్రకృతిలో మార్పును, వెలుగును, కొత్త ఆశలను స్వాగతించే రోజు ఇది.

మకర సంక్రాంతి అనేది రైతు శ్రమకు పండుగ. వానలు, ఎండలు, కష్టాలు అన్నీ దాటుకుని పండిన పంట ఇంటికి చేరిన ఆనందమే ఈ పండుగ. రైతు తన కష్టానికి ఫలితం దక్కిందనే సంతృప్తిని ఈ రోజు ప్రకృతికి, దేవుడికి కృతజ్ఞతగా వ్యక్తం చేస్తాడు. కొత్త పంటతో చేసిన పొంగలి, పాయసం, సకినాలు, గారెలు… వంటింటి నుంచి వచ్చే వాసనే పండుగని ప్రకటిస్తుంది. కలగలిపిన కూరగాయల విందు, పప్పు పులుసుల రుచులు, పెద్దలను తలుచుకుంటూ ఇచ్చే తాంబూలాలు, అయినవారికి పెట్టే కొత్త బట్టలు, కుటుంబమంతా కలిసి చెప్పుకునే ముచ్చట్లు, ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, రంగురంగుల అలంకరణలు పండుగ శోభను పెంచుతాయి. హరిదాసుల పాటలు, గంగిరెద్దుల నృత్యాలు గ్రామాలకు ప్రత్యేక కళను తీసుకువస్తాయి. పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ ఆకాశాన్ని తమ ఆనందంతో రంగురంగులతో నింపుతారు. పెద్దలు ఒకరినొకరు కలిసి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఆశీర్వాదాలు, నవ్వులు, సంతృప్తి ఇవన్నీ కలిసే మకర సంక్రాంతి ఒక అందమైన అనుభూతి.

ఈ పండుగ కేవలం భోజనాలకే పరిమితం కాదు. పంచుకోవడం, కలిసి ఉండడం, బంధాలను బలపరచుకోవడం దీని అసలైన అర్థం. అందుకే సంక్రాంతి రోజున బంధువుల ఇళ్లు తిరగడం, పెద్దల కాళ్లు మొక్కడం, చిన్నారులకు బహుమతులు ఇవ్వడం సంప్రదాయంగా మారాయి. ఊరంతా కలిసి రంగవల్లులు పోటీలు ఏర్పాటుచేయడం, ఆడపిల్లలు సరదాగా పోటీలలో పాల్గొనడం, చిన్న చిన్న బహుమతులు గెలుచుకుని మురిసిపోవడం వంటివి ప్రత్యేక ఆకర్షణలు. ఆడపిల్లలు లంగావోణీలతో, అబ్బాయిలు పంచె కట్టులతో సాంప్రదాయాలను పాటిస్తూ కొత్త దుస్తులు దరిస్తారు. బావా మరదళ్ళ సరదాలు, చిన్న పిల్లల ఆటపాటలు అన్నీ పండుగకు కొత్త అందాన్ని ఇస్తాయి. సంక్రాంతి మనకు నేర్పే పాఠం ఒక్కటే, మన ఎదుగుదల వెనుక ఉన్న ప్రతి చేతికి కృతజ్ఞత తెలపడం, తరాలన్నీ ఒకచోట చేరి ఆప్యాయంగా మనసులో భావాలను పంచుకోవడం, ఆనందంతో సంబరాలు అంబరాన్ని తాకేలా పండుగ జరుపుకొంటూ, మన వారసత్వాన్ని, సంప్రదాయాల్ని ఇంకో తరానికి అందించడం.

భారతదేశమంతా సంక్రాంతి ఒకే భావంతో, కానీ వేర్వేరు పేర్లతో జరుపుకుంటారు. తమిళనాడులో ఇది నాలుగు రోజుల పొంగల్ ఉత్సవం. భోగి పొంగల్, సూర్య పొంగల్, మట్టుపొంగల్, కాణుం పొంగల్. సూర్యునికి కొత్త పంటతో చేసిన పొంగల్ అర్పించి కృతజ్ఞత తెలుపుతారు. కర్ణాటకలో ఎల్లూ-బెల్లూ పంచుకోవడం మధుర సంబంధాలకు ప్రతీక. మహారాష్ట్రలో “తిల్ గుల్ ఘ్యా, గోడ్ గోడ్ బోలా” అంటూ తిల్గుల్ పంచుకుంటారు. పంజాబ్, హర్యానాలలో లోహ్రీ మంటల చుట్టూ తిరుగుతూ ఉత్సవం జరుగుతుంది. అస్సాంలో భోగాలీ బిహు, పశ్చిమ బెంగాల్లో పౌష్ సంక్రాంతి, గుజరాత్‌లో గాలిపటాల పండుగగా సంక్రాంతి ప్రకృతితో మనిషి అనుబంధాన్ని చాటుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలకు ముగింపు పలికేది కనుమ. కనుమ పండుగ గ్రామీణ జీవనానికి అద్దంలా ఉంటుంది. ఇది పశుసంపదకు అంకితమైన పండుగ. వ్యవసాయ జీవనంలో ఎద్దులు, ఆవులు, గేదెల పాత్ర ఎంత ముఖ్యమో గుర్తు చేసే రోజు ఇది.

కనుమ ఉదయం రైతులు తమ పశువులను స్నానం చేయించి, కొమ్ములకు రంగులు పూసి, పూల దండలు వేసి అలంకరిస్తారు. కొత్త తాళ్లు, గంటలు కట్టి పూజలు చేస్తారు. ఎద్దులకు ప్రత్యేకంగా పిండి వంటకాలు పెట్టడం ఆనవాయితీ. ఈ రోజు జరిగే ఎద్దుల పందాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన ఆకర్షణ. బలమైన ఎద్దుల మధ్య జరిగే ఈ పోటీలు రైతుల ఉత్సాహాన్ని, గ్రామ ఐక్యతను ప్రతిబింబిస్తాయి.

కొన్ని ప్రాంతాల్లో కనుమకు కోడి పందాలు కూడా భాగంగా ఉండేవి. ఇవి ఒకప్పుడు గ్రామీణ వినోదానికి, ధైర్యానికి ప్రతీకలుగా భావించేవారు. నేటి కాలంలో చట్టపరమైన పరిమితులతో ఇవి నియంత్రణలో ఉన్నప్పటికీ, కనుమకు ఉన్న ఉత్సాహం మాత్రం తగ్గలేదు.

కనుమ రోజున ఇళ్లలో మాంసాహార వంటకాలు ప్రత్యేకం. కోడి కూర, మటన్ వంటకాలు, బెల్లంతో చేసిన పదార్థాలు భోజనాలకు ప్రత్యేక రుచి తెస్తాయి. బంధువులు, స్నేహితులు కలిసి విందులు చేసుకోవడం అనుబంధాలను మరింత బలపరుస్తుంది. నవ్వులు, ఆటలు, పాటలు… పల్లె మొత్తం ఒక పండుగ రంగస్థలంలా మారుతుంది.

ఈ మూడు రోజులు ముగిసిన తరువాత పల్లెల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంటుంది. భోగి మంటల వేడి, సంక్రాంతి సందడి, కనుమ ఆటపాటలు అన్నీ జ్ఞాపకాలుగా మిగులుతాయి. కొన్ని రోజుల పాటు జీవంతో నిండిన ఇళ్లు తిరిగి మామూలు రోజులను ఎదురుచూస్తూ నిశ్శాంతంగా నిలుస్తాయి. పల్లె దారుల్లో వినిపించిన నవ్వులు, పిల్లల పరుగులు, బంధువుల మాటలు… అన్నీ మెల్లగా మౌనంలో కలిసిపోతాయి.

మళ్లీ అదే తిరుగు ప్రయాణం మొదలవుతుంది. పట్టణాల వైపు సాగుతున్న బస్సులు, రైళ్లు కేవలం ప్రయాణికులను మాత్రమే కాదు. వారి హృదయాల్లో నిండిన ఊరు జ్ఞాపకాలను కూడా మోసుకుంటాయి. అమ్మ చేతి వంట రుచి, నాన్న ఆశీర్వాదం, పల్లె గాలి తాకిడి… అన్నీ హృదయంలో దాచుకుని వెళ్లిపోతారు. వెనక్కి తిరిగి చూస్తూ “మళ్లీ ఎప్పుడు వస్తామో” అనే మౌన ప్రశ్న ప్రతి మనసులో నలుగుతుంది.

కానీ ఈ ప్రయాణం వీడ్కోలు కాదు. అది ఆశతో నిండిన విరామం. జీవన పోరాటంలో మళ్లీ ముందుకు నడిచే శక్తిని పల్లె ఇచ్చిందనే నమ్మకం. వచ్చే సంక్రాంతికి మళ్లీ ఇదే దారి పడతామనే ఆశ. ఎక్కడున్నా ఊరే మన మూలం. పండుగలు వచ్చేవరకు జ్ఞాపకాలే తోడు.

సంక్రాంతి ముగిసినా, అది మనలో మిగిల్చే వెచ్చదనం మాత్రం ఎప్పటికీ ముగియదు. తిరుగు ప్రయాణం మొదలైనా… మనసు మాత్రం ఊర్లోనే ఆగిపోతుంది. అదే సంక్రాంతి అసలైన బహుమతి, మనల్ని మనమే గుర్తుచేసే అసలైన పండుగ సంక్రాంతి.