Let's talk: editor@tmv.in
సంక్రాంతికి రూ.3 వేల సహాయం: సీఎం స్టాలిన్

సంక్రాంతికి రూ.3 వేల సహాయం: సీఎం స్టాలిన్

Pinjari Chand
5 జనవరి, 2026

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్ రాష్ట్రంలోని రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.3,000 సంక్రాంతి(పొంగల్)నగదు బహుమతిని ప్రకటించారు. శ్రీలంక తమిళుల పునరావాస శిబిరాల్లో నివసిస్తున్న కుటుంబాలకూ ఈ సహాయం వర్తిస్తుందని తెలిపారు. పొంగల్ పండుగను ప్రతి కుటుంబం ఆనందంగా జరుపుకునేలా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పండుగకు ముందే ఫెయిర్ ప్రైస్ షాపుల ద్వారా నగదు సహాయాన్ని, సంప్రదాయ పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్‌తో పాటు దుస్తులతో కలిసి పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రకృతి, సూర్యుడు, పశువులు, రైతులకు కృతజ్ఞతగా జరుపుకునే ముఖ్యమైన తమిళ పండుగ అయిన పొంగల్ కుటుంబ సమైక్యత, సంపదకు ప్రతీకగా నిలుస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పటికే అర్హులైన వారికి ఒక కిలో బియ్యం, ఒక కిలో చక్కెర, ఒక చెరుకును పొంగల్ గిఫ్ట్ ప్యాకేజీని ప్రకటించింది.

తమిళనాడు చరిత్రలోనే అతిపెద్ద పొంగల్ సహాయం

ఈ ఏడాది మొత్తం 2,22,01,710 బియ్యం రేషన్ కార్డు కుటుంబాలు, శ్రీలంక తమిళ పునరావాస శిబిరాల్లోని కుటుంబాలు ఈ పొంగల్ సహాయంతో లబ్ధి పొందనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పొంగల్ సందర్భంగా పంపిణీ చేయాల్సిన ధోతీలు, చీరలు ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించినట్లు తెలిపారు. రూ.3,000 నగదు సహాయం పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య కుటుంబాలకు ఊరటనిచ్చేలా ఉండడంతో పాటు, పండుగ ఖర్చులకు దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇది సామాజిక సంక్షేమం, సమగ్ర అభివృద్ధి పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని వెల్లడించింది. తమిళనాడు చరిత్రలోనే అతిపెద్ద పొంగల్ నగదు సహాయంగా ప్రజలు పేర్కోంటున్నారు.

ఇదిలా ఉండగా, శనివారం చెన్నైలోని అన్నా అరివాలయంలో డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో పోర్టల్–2026ను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. రైతులు, వ్యాపారులు, వృత్తిపరులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత తదితరులు తమ సూచనలు ఇవ్వడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని డీఎంకే ఎంపీ కనిమొళి తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజల మేనిఫెస్టో రూపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆమె అన్నారు.