
సంక్రాంతికి దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండగను పురస్కరించుకుని సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. పండగ సీజన్‌లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన, భద్రమైన ప్రయాణం కల్పించడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని రైల్వే అధికారులు తెలిపారు.
ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్–అనకాపల్లి మధ్య జనవరి 4, 11, 18 తేదీల్లో నడుస్తుంది. అదే విధంగా తిరుగు ప్రయాణంలో అనకాపల్లి–సికింద్రాబాద్ మధ్య జనవరి 5, 12, 19 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసు అందుబాటులో ఉంటుంది. పండగ సందర్భంగా కుటుంబాలతో కలిసి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 8గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయనుంది.
ప్రత్యేక రైళ్ల ద్వారా సాధారణ రైళ్లపై ఉన్న భారాన్ని తగ్గించడంతో పాటు, టిక్కెట్లు సులభంగా లభించే అవకాశం ఉందని తెలిపారు. ప్రయాణికులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుని, రైళ్ల సమయాలు నిలుపుదల వివరాలను రైల్వే వెబ్‌సైట్ లేదా అధికారిక ప్రకటనల ద్వారా తెలుసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
