
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఇంటి భద్రత మరువకండి!: సీపీ సజ్జనార్
సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇంటి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీపీ సజ్జనార్ సూచిస్తున్నారు. పండుగ వేళల్లో తాళం వేసిన ఇళ్లే దొంగల ప్రధాన లక్ష్యంగా మారుతాయని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. అందువల్ల ప్రయాణానికి ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
ఇంట్లో ఉన్న నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచాలని ఆయన సూచించారు. అలాగే సోషల్ మీడియాలో ప్రయాణ వివరాలు, ఊరికి వెళ్తున్నామని సూచించే పోస్టులు, ఫోటోలు షేర్ చేయకపోవడం మంచిదని ఆయన తెలిపారు. ఇలాంటి సమాచారం దొంగలకు సంకేతంగా మారే ప్రమాదం ఉందన్నారు.
పండుగ కోసం ఇంటిని తాళం వేసి వెళ్లే వారు తమ ప్రాంతంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌కు ముందుగా సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. అవసరమైతే పోలీస్ పేట్రోలింగ్‌ను పెంచి, ఇళ్లపై నిఘా ఉంచే అవకాశం ఉంటుందని తెలిపారు. పొరుగువారితో సమన్వయం చేసుకొని ఇళ్లను చూసేలా ఏర్పాటు చేసుకోవడం కూడా ఉపయుక్తమని ఆయన సూచించారు.
ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు గమనించినట్లయితే వెంటనే డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజల భద్రతే తమ ప్రధాన బాధ్యత అని పేర్కొన్న పోలీసులు, అందరూ ఆనందంగా, ప్రశాంతంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సీపీ సజ్జనార్ ఆకాంక్షించారు.
