Let's talk: editor@tmv.in
సంక్రాంతికి అదనపు బస్సు చార్జీలు లేవు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్

సంక్రాంతికి అదనపు బస్సు చార్జీలు లేవు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్

Panthagani Anusha
14 జనవరి, 2026

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, గతంలో పండుగ సమయాల్లో విధించే ప్రత్యేక చార్జీలను ఈ ఏడాది రద్దు చేస్తున్నామని సాధారణ ధరలకే ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని స్పష్టం చేశారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పండుగ రోజుల్లోనూ యథావిధిగా కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు. ఆర్టీసీ చార్జీల్లో ఎలాంటి పెంపు లేకపోవడం ప్రయాణికులకు ప్రభుత్వం ఇచ్చే పండుగ కానుక అని ఆయన అభివర్ణించారు. పండుగ వేళ ప్రజలు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా క్షేమంగా ఊళ్లకు వెళ్లాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై మంత్రి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు అక్రమంగా చార్జీలు పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక వసూళ్లకు పాల్పడినట్లు తేలితే సంబంధిత బస్సులను వెంటనే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ బస్సుల రాకపోకలు, చార్జీలపై రవాణా శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలు పాటించాలని మంత్రి సూచించారు. అతివేగాన్ని నియంత్రించుకుని, జాగ్రత్తగా ప్రయాణించి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.