
షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్.. తెలంగాణలో కొత్త విధానం అమలు
తెలంగాణ రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇకపై కొత్త వాహనం కొనుగోలు చేసే వారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. శనివారం నుంచి 'డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్' విధానం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఏమిటీ నూతన విధానం?
ఈ నూతన విధానం ద్వారా వాహనదారులు ఇకపై రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. వాహనం కొనుగోలు చేసిన అదే షోరూమ్‌లోనే ఫోటోలు తీసి, అవసరమైన డాక్యుమెంట్లను ఆన్లైన్‌లో అప్లోడ్ చేసి, అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ నంబర్ పొందే అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తరువాత, వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) నేరుగా పోస్టు ద్వారా వాహనదారుడి ఇంటికే చేరనుంది.
ఈ విధానం అమలుకు ముందు శుక్రవారం హైదరాబాద్ మాదాపూర్‌లో ట్రయల్ రన్ నిర్వహించగా, అది పూర్తిస్థాయిలో విజయవంతమైందని మంత్రి తెలిపారు. దీని ఆధారంగా శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
రవాణా శాఖను పూర్తిగా డిజిటల్ దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో, అన్ని రకాల సేవలను ఆన్లైన్‌లో అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం సారథి పోర్టల్‌లో చేరి, లైసెన్సులు, పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు వంటి సేవలను మరింత సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
అలాగే, రవాణా శాఖ ద్వారా ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాల) పాలసీ, వాహన స్క్రాప్ పాలసీ వంటి కీలక విధానాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి గుర్తు చేశారు. ఈ సంస్కరణలన్నింటి లక్ష్యం ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, అవినీతి రహిత సేవలను అందించడమేనని మంత్రి తెలిపారు.
ఈ నూతన విధానంతో వాహనదారుల సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని, రవాణా శాఖ కార్యాలయాలపై భారం కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రజలంతా ఈ మార్పులకు సహకరించి, ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు నేటితో పూర్తిగా ముగియనున్నాయి.
