Let's talk: editor@tmv.in
‘షేమ్ ఆన్ యూ’: హర్యానా పోలీసులపై సుప్రీం సీరియస్‌

‘షేమ్ ఆన్ యూ’: హర్యానా పోలీసులపై సుప్రీం సీరియస్‌

Pinjari Chand
26 మార్చి, 2026

మూడు సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచార కేసును ‘అసహనీయంగా, నిర్లక్ష్యంగా, కఠినంగా, కనీస విచక్షణ లేకుండా ’ హ్యాండిల్ చేసినందుకు సుప్రీం కోర్టు హర్యానా పోలీస్, గురుగ్రామ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడానికి మహిళా ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ (న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చీ, విపుల్‌ ఎం.పంచోలీ) ఈ కేసు నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇదేనా రాష్ట్రం నేరాలను హ్యాండిల్ చేసే విధానం? షేమ్ ఆన్ యూ(మీకు సిగ్గులేదా)! అంటూ వ్యాఖ్యానించింది.

బాలికపై జరిగిన దారుణం కంటే, దర్యాప్తు ప్రక్రియలో ఆమె మరింత బాధను అనుభవించాల్సి వచ్చిందని కోర్టు పేర్కొంది. పోలీసుల చర్యలు అనుమానితులను కాపాడే విధంగా ఉన్నాయని, బాధితురాలి వాదనను తగ్గించేందుకు ప్రయత్నించారని వ్యాఖ్యానించింది. ప్రత్యేకంగా, బాధితురాలిని ఇంటికి వెళ్లి విచారణ చేయాల్సిన పోలీసు అధికారులు, ఆమెను తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, అదే సమయంలో నిందితుల సమక్షంలో వాంగ్మూలాలు రికార్డు చేయడం తీవ్రంగా తప్పుబట్టింది. ఇది నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. కేసు తీవ్రత ఉన్నప్పటికీ, పోలీసులు దానిని తగ్గించి చూపేందుకు ప్రయత్నించారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు సెక్షన్ 6 (అగ్రవేటెడ్ పెనెట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్) కింద కేసు నమోదు చేయాల్సినప్పుడు, తక్కువ శిక్ష ఉన్న సెక్షన్ 10 కింద నమోదు చేయడం అసంబద్ధం అని పేర్కొంది.

సిట్‌ ఏర్పాటు

న్యాయస్థానం ఆదేశాల మేరకు, మహిళా ఐపీఎస్ అధికారులతో కూడిన సిట్‌ ఏర్పాటు చేశారు. ఇందులో ఏడీజీపీ కాలా రామచంద్రన్, ఎస్పీ డా. అన్షు సింగ్లా, డిప్యూటీ సీపీ జస్లీన్ కౌర్ సభ్యులుగా ఉన్నారు. అలాగే ఈ కేసును మహిళా న్యాయమూర్తి ఉన్న ప్రత్యేక పోక్సో కోర్టుకు బదిలీ చేయాలని గురుగ్రామ్ జిల్లా సెషన్స్ జడ్జిని ఆదేశించింది.

పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు?

ఈ కేసులో పోలీసుల వైఖరి మారుతూ ఉండటం కూడా కోర్టు దృష్టికి వచ్చింది. మొదట ఎలాంటి నేరం లేదని చెప్పి, తర్వాత బాధితురాలి తండ్రి ఫిర్యాదు తర్వాత తిరిగి పరిశీలించడం విచారణ నిష్పక్షపాతతపై అనుమానాలు కలిగిస్తోందని తెలిపింది. అదే సమయంలో, గురుగ్రామ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పనితీరుపై కూడా కోర్టు తీవ్ర విమర్శలు చేసింది. కమిటీ సభ్యుల అర్హతలు, సామర్థ్యాలపై సందేహం వ్యక్తం చేస్తూ, వారి నియామకాలపై పూర్తి వివరాలతో ఒక వారం లోపల అఫిడవిట్ దాఖలు చేయాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసులో ఇప్పటివరకు విచారణ చేసిన పోలీసు అధికారులను తప్పించి, వారిపై క్రమశిక్షణా, క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయాలని కోర్టు తెలిపింది.

పోలీసుల వివరాల ప్రకారం, గురుగ్రామ్‌లోని సెక్టార్-54లో ఈ ఘటన జరిగింది. ఇద్దరు మహిళా సహాయకులు, వారి సహచరుడు బాలికపై సుమారు రెండు నెలల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. బాలిక తల్లికి ఈ విషయం తెలియడంతో ఫిబ్రవరి 4న కేసు నమోదు చేశారు.