Let's talk: editor@tmv.in
షేక్ హసీనా మీడియా ఇంటర్వ్యూ.. భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు

షేక్ హసీనా మీడియా ఇంటర్వ్యూ.. భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు

Shaik Mohammad Shaffee
14 నవంబర్, 2025

భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా స్థానిక భారతీయ మీడియాతో సంభాషించడంపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తమ నిరసనను అధికారికంగా తెలియజేయడానికి బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఢాకాలోని భారత డిప్యూటీ హైకమిషనర్ పవన్‌ బాధేను పిలిపించింది (సమన్లు జారీ చేసింది). ఈ విషయాన్ని ఆ దేశ వార్తా సంస్థ బంగ్లాదేశ్ సంగబాద్ సంస్థ (బీఎస్ఎస్) నివేదించింది. హసీనాను మీడియాతో మాట్లాడేందుకు అనుమతించకూడదనే తమ అభ్యర్థనను భారత ప్రభుత్వానికి తెలియజేయాలని బంగ్లాదేశ్, డిప్యూటీ హైకమిషనర్‌ను కోరింది.

మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారతదేశం ఆశ్రయం కల్పించడం, మీడియా వేదికను అందించడంపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. "మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకు షేక్‌ హసీనా విచారణ ఎదుర్కొంటున్నారు. పరారీలో ఉన్న ఆమెకు ఆశ్రయం కల్పించడం, స్వదేశంలో ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు, ఉగ్రచర్యలను ప్రోత్సహించేందుకు వేదిక కల్పించడం.. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఏ మాత్రం మేలు చేయవు" అని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ భారత దౌత్యవేత్తకు స్పష్టం చేసినట్లు బీఎస్ఎస్ నివేదిక పేర్కొంది.

హసీనా ఇంటర్వ్యూలో ఏముంది?

ఈ వివాదానికి ప్రధాన కారణం ఇటీవల షేక్ హసీనా ప్రముఖ భారతీయ వార్తా సంస్థకి ఇచ్చిన ఈమెయిల్ ఇంటర్వ్యూ. తాను స్వదేశానికి తిరిగి రావాలంటే, బంగ్లాదేశ్‌లో అందరి భాగస్వామ్యం ఉండేలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని షేక్ హసీనా ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో తన పార్టీ అయిన అవామీ లీగ్‌పై నిషేధం ఎత్తివేసినప్పుడు, స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్వహించినప్పుడే తాను తిరిగివెళ్తానని ఆమె తెలిపారు. అటువంటి ప్రజాస్వామ్య పరిస్థితులనే అక్కడి ప్రజలు కూడా కోరుకుంటున్నారని ఆమె అన్నారు. ఇలా హసీనా బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలపై వ్యాఖ్యానించడంపైనే బంగ్లాదేశ్ తాజాగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామం నవంబర్ 11న బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ అధికార ప్రతినిధి షఫీఖుల్ అలం తన ఫేస్‌బుక్ పోస్టులో చేసిన వ్యాఖ్యల తర్వాత చోటు చేసుకుంది. ఆయన హసీనాతో ఇంటర్వ్యూలు చేసిన భారత, పాశ్చాత్య మీడియా ప్రతినిధులను "పాశ్చాత్య జర్నలిస్టులు, వారి భారతీయ బూట్‌లికింగ్ (వారికి అనుకూలంగా పనిచేయడం, కాళ్లబేరానికి పోవడం) సహచరులు" అని పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ) ఆలం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఆశించదగినవి కావని, ఆలం కూడా గతంలో జర్నలిస్టుగా పనిచేశారని పీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

2024 జూలైలో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టింది. 2024 ఆగస్టు 5న, మాజీ ప్రధాని షేక్ హసీనా భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత ముహమ్మద్ యూనుస్ ప్రధాన సలహాదారు నాయకత్వంలో బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. కాగా ఈ విషయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎటువంటి వ్యాఖ్య చేయకుండా నిరాకరించింది.

షేక్ హసీనా-బంగ్లాదేశ్ వివాదం సద్దుమణగాలంటే?

షేక్ హసీనా-బంగ్లాదేశ్ వివాదం సద్దుమణగాలంటే పరస్పర సంభాషణ, సహనం, నమ్మకం అవసరం. హసీనా అనుచరులు, తాత్కాలిక ప్రభుత్వం మధ్య చర్చలు జరగాలి. భారతదేశం-బంగ్లాదేశ్ దౌత్యపరంగా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. మీడియా వేదికలను రాజకీయ దాడులకు కాకుండా శాంతియుత చర్చలకు వినియోగించాలి. రెండు దేశాలు ప్రజల ప్రయోజనాలను కాపాడుతూ ద్వైపాక్షిక సంబంధాలను బలపరచాలి. అవసరమైతే అంతర్జాతీయ సంస్థల మధ్యవర్తిత్వం తీసుకోవచ్చు. సహనంతో కూడిన రాజకీయ పరిపక్వత మాత్రమే ఈ ఉద్రిక్తతను శాంతియుతంగా ముగించగలదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

షేక్ హసీనా మీడియా ఇంటర్వ్యూ.. భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు - Tholi Paluku