Let's talk: editor@tmv.in
షేక్ హసీనాకు మరో మూడు కేసుల్లో 21 ఏళ్ల జైలు శిక్ష

షేక్ హసీనాకు మరో మూడు కేసుల్లో 21 ఏళ్ల జైలు శిక్ష

Shaik Mohammad Shaffee
28 నవంబర్, 2025

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అవినీతి కేసుల్లో ఢాకా కోర్టు గురువారం 21 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఢాకా స్పెషల్ జడ్జి-5 మహమ్మద్ అబ్దుల్లా అల్ మామున్ ఈ తీర్పును వెలువరించారు. షేక్ హసీనాపై నమోదైన మూడు ప్లాట్ మోసాల కేసులలో ఒక్కొక్కదానికి ఏడేళ్ల చొప్పున మొత్తం 21 ఏళ్ల జైలు శిక్ష పడింది.

ఢాకాలోని పూర్బాచల్ ప్రాంతంలో ప్రభుత్వ ప్లాట్లను అక్రమంగా కేటాయించారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ (ఏసీసీ) ఆమె, ఆమె కుటుంబ సభ్యులపై గత జనవరిలో ఆరు వేర్వేరు కేసులు దాఖలు చేసింది. మిగిలిన మూడు కేసుల్లో తీర్పు డిసెంబర్ 1న ప్రకటిస్తారు. ఈ అవినీతి కేసుల్లో షేక్ హసీనా కుటుంబ సభ్యులకు కూడా శిక్షలు పడ్డాయి. ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్‌కి ఐదేళ్ల జైలు శిక్ష, 100,000 టాకాల జరిమానా విధించారు. ఆమె కుమార్తె సైమా వాజెద్ పుతుల్‌కు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధించారు.

అయితే అంతకుముందే నవంబర్ 17న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశ్, గత ఏడాది జూలైలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేసే ప్రయత్నాల్లో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకు షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. ఈ కేసుల్లో షేక్ హసీనా, ఆమె కుటుంబం పరారీలో ఉన్నందున, వారి తరఫున కోర్టులో వాదించడానికి ఏ న్యాయవాది కూడా హాజరు కాలేదు. ప్రజస్వామిక తీర్పు లేని, ప్రజలు ఎన్నుకోని ఓ ప్రభుత్వం నియమించిన నకిలీ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పుగా ఆమె వర్ణించారు. తనకు మరణ శిక్ష విధిస్తూ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పుపై హసీనా స్పందిస్తూ, ఈ తీర్పు మోసపూరితమైనదని పేర్కొన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండించారు.

భారత్‌కు అప్పగింత అభ్యర్థన

గతేడాది జూలై-ఆగస్టు అల్లర్ల తర్వాత ఆమె దేశం విడిచి పారిపోయి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనుస్ నాయకత్వంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. ఢాకా నుండి వచ్చిన ఈ అభ్యర్థనను పరిశీలిస్తున్నామని చెప్పారు. బంగ్లాదేశ్ శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం కోసం భారత్ కట్టుబడి ఉంటుందని, ఈ విషయంలో న్యాయపరమైన, అంతర్గత చట్టపరమైన ప్రక్రియల ద్వారా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు.

షేక్ హసీనాకు మరో మూడు కేసుల్లో 21 ఏళ్ల జైలు శిక్ష - Tholi Paluku