Let's talk: editor@tmv.in
షెడ్యూల్‌కు ముందే రాజకీయ కాక!

షెడ్యూల్‌కు ముందే రాజకీయ కాక!

T Venkata Ramana
7 అక్టోబర్, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. షెడ్యూల్ ఇంకా వెలువడక ముందే ప్రధాన పార్టీల మధ్య పోటీ తారాస్థాయికి చేరుకుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కంకణం కట్టుకున్న బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచార పర్వంలో దూసుకెళ్తోంది. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ కేటాయించి సానుభూతి అస్త్రాన్ని ప్రధాన ప్రచారాంశంగా మలచుకుంది. జూబ్లీహిల్స్ ప్రజలు మాగంటి కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయం వచ్చిందంటూ బీఆర్ఎస్ నేతలు ప్రజల మద్దతు కూడగడుతున్నారు.

మరోవైపు అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ సానుభూతి ప్రభావాన్ని ఛేదించి విజయం సాధించాలనే పట్టుదలతో ఈ రెండు జాతీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. క్షేత్రస్థాయి సమీక్షలు, సర్వేలు, కమిటీలతో బిజీగా గడుపుతున్నప్పటికీ ఇప్పటికీ అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసుకోకపోవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అభ్యర్థి ఎంపికలో జాప్యమెందుకు?

బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి రోజురోజుకు ప్రచారంలో ముందంజలో ఉండగా కాంగ్రెస్, బీజేపీలు మాత్రం అభ్యర్థి ఎంపికపైనే తర్జనభర్జన పడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ రెండూ జాతీయ పార్టీలు కావడంతో కీలకమైన ఉపఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసే అధికారం ఎక్కువగా కేంద్రంలోని అధిష్ఠానం చేతుల్లో ఉంటుంది. స్థానిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు, భవిష్యత్తు రాజకీయాలపై సుదీర్ఘ చర్చలు నివేదికల ఆధారంగానే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

గెలుపు గుర్రం కోసం కసరత్తు

బీఆర్ఎస్ సానుభూతిని సమర్థవంతంగా ఎదుర్కొని పార్టీని గెలుపు తీరాలకు తీసుకెళ్లగలిగే 'దమ్మున్న' నేత కోసం ఈ రెండు పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. కేవలం స్థానిక ప్రజాదరణే కాకుండా ఆర్థిక వనరులు, పోరాటపటిమ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిని ఫైనల్ చేయడంలో ఆలస్యం జరుగుతోంది.అధికారికంగా ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే పూర్తిస్థాయిలో వ్యూహరచన చేయాలని అంతవరకు అంతర్గతంగా బలాబలాలను అంచనా వేసుకోవాలనే వైఖరిలో ఈ పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్‌కు ముందే కీలక అభ్యర్థిని ప్రకటించడం ద్వారా ప్రత్యర్థులకు తమ వ్యూహాన్ని తెలుసుకునే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశం కూడా ఉండవచ్చు.

అధిష్టానానికి చేరిన జాబితా

కాంగ్రెస్ పార్టీ త్రిమెన్ కమిటీ ఇప్పటికే అభ్యర్థుల తుది జాబితాను అధిష్ఠానానికి సమర్పించినట్లు సమాచారం. జాబితాలో మొత్తం నలుగురి పేర్లు ఉన్నట్లు సమాచారం. అయితే ఇందులో ముఖ్యంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక నేతలు నవీన్ యాదవ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరో ఇద్దరి పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాలో

ఎలిమినేషన్ తర్వాత ఎవరు ఫైనల్ అవుతారనేది పార్టీలో గుబులు రేపుతోంది. కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు, కోఆర్డినేటర్లతో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ కీలక సమావేశాలు నిర్వహించారు. ఎవరికి టికెట్ ఇస్తే పార్టీకి అత్యధిక ప్రయోజనం చేకూరుతుందనే అంశంపై వివరాలు సేకరించారు. కాంగ్రెస్ తమ అభ్యర్థిని రెండురోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ సానుభూతిని బ్రేక్ చేయగలమని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తంచేస్తున్నారు. కంటోన్మెంట్ ఫలితాలే జూబ్లీహిల్స్‌లోనూ పునరావృతమవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు.

బీజేపీ ఆశలు

బీజేపీకి బ్రాండ్‌గా భావించే జూబ్లీహిల్స్ అర్బన్ ఏరియా కావడం, యువత ఓటర్లు అధికంగా ఉండటంతో ఉపఎన్నికలో విజయంపై బీజేపీ ధీమాతో ఉంది. పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండటం కూడా బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ మాదిరిగానే బీజేపీ కూడా అభ్యర్థి ఎంపిక కోసం త్రిమెన్ కమిటీని నియమించింది. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్‌లో అభ్యర్థి ఎంపికపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ ధీమా

గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. ఈ కారణంగా సిటీ బీఆర్ఎస్‌దే అన్న ధీమా గులాబీ పార్టీలో బలంగా ఉంది. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో జోరు పెంచింది. పూర్తి బాధ్యతను తీసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే డివిజన్ల వారీగా సమాావేశాలు నిర్వహిస్తున్నారు. సునీతను గెలిపించేందుకు పట్టుదలతో ముందుకు దూసుకెళ్తున్నారు.

బీఆర్ఎస్ సానుభూతిని బ్రేక్ చేస్తారా?

బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై ఉన్న సానుభూతిని బ్రేక్ చేసే నాయకుడి కోసం కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న కసరత్తే ఈ ఎన్నిక యొక్క ప్రాధాన్యతను పెంచుతోంది. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందే అధికార, విపక్ష పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో హైదరాబాద్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్ సానుభూతిని ఎదుర్కొని జాతీయ పార్టీలు తమ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించి ప్రచార పర్వంలోకి దిగుతాయో వేచి చూడాలి.

షెడ్యూల్‌కు ముందే రాజకీయ కాక! - Tholi Paluku