
షెడ్యూల్‌కులాల రిజర్వేషన్‌లో ‘క్రీమీ లేయర్’ ఉండాల్సిందే: సీజేఐ గవాయ్
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ షెడ్యూల్ కులాల రిజర్వేషన్‌లో కూడా ‘క్రీమీ లేయర్’ విధానం తప్పనిసరిగా వర్తించాలనే అభిప్రాయాన్ని మరోసారి స్పష్టం చేశారు. ‘ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ కానిస్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఒక ఐఏఎస్ అధికారి పిల్లవాడిని పేద వ్యవసాయ కూలీ పిల్లవాడితో రిజర్వేషన్ విషయంలో ఒకే స్థాయిలో చూడడం న్యాయసమ్మతం కాదని తెలిపారు.
తీర్పుపై విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గను
"ఇంద్రా సాహ్నే కేసులో న్యాయస్థానం పేర్కొన్నట్లుగా క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీలకు) ఎలా వర్తిస్తుందో అదే విధంగా ఇది షెడ్యూల్ కులాలకు సైతం వర్తించాలి," అని జస్టిస్ గవాయ్ అన్నారు. ఈ అభిప్రాయం చెప్పినందుకు నా తీర్పుపై గతంలో విస్తృతంగా విమర్శలు వచ్చినప్పటికీ, నేను ఇప్పటికీ అదే అభిమతంతో స్థిరంగా ఉన్నాను, అని ప్రకటించారు. న్యాయమూర్తులు సాధారణంగా తమ తీర్పులను సమర్థించుకోరని గుర్తుచేస్తూనే, తాను మరి కొన్ని రోజుల్లోనే పదవీ విరమణ చేయబోతున్నానని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
సమానత్వం వైపు దేశం అడుగులు
దేశంలో సమానత్వం, మహిళా సాధికారత పట్ల అవగాహన పెరుగుతోందని గతంలో మహిళలు ఎదుర్కొన్న వివక్షను సమాజం బలంగా వ్యతిరేకిస్తున్నదని సీజేఐ పేర్కొన్నారు. వేదిక సందర్భంగా మరో ఆసక్తికర అంశాన్ని పంచుకుంటూ తాను చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాల్గొన్న తొలి కార్యక్రమం మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిందని పదవీ విరమణకు ముందు పాల్గొన్న చివరి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ అమరావతిలో కావడం విశేషమని జస్టిస్ గవాయ్ తెలిపారు.
కాగా జస్టిస్ గవాయ్ 2024లో కూడా రాష్ట్రాలు షెడ్యూల్ కులాలు (ఎస్సీ) షెడ్యూల్ తెగలు (ఎస్టీ)లో ‘క్రీమీ లేయర్’ను గుర్తించే విధానం రూపొందించి, రిజర్వేషన్ ప్రయోజనం వారికి నిరాకరించాల్సిన అవసరం ఉందని గతంలోనే అభిప్రాయపడ్డారు.
క్రీమీ లేయర్’ అంటే ఏమిటి?
ఒక వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నత ఆదాయం, మంచి విద్య, స్థిరమైన ఉద్యోగం, సామాజిక ప్రాధాన్యం వంటి అంశాల వల్ల ముందుకు వచ్చి, ఇక రిజర్వేషన్ అవసరం లేని స్థితికి చేరితే, అతనిని లేదా అతని కుటుంబాన్ని క్రీమీ లేయర్ గా పరిగణిస్తారు.
మునుపటి నుంచే కొనసాగుతున్న చర్చ
షెడ్యూల్ కులాల్లో ‘క్రీమీ లేయర్’ అమలు గురించి చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ వివాదానికి బలమైన పునాది 1992లోనే వేశారు. ఆ సమయంలో వెలువడిన ఇంద్రా సాహ్నే (మండల్ కమిషన్ కేసు) తీర్పులో సుప్రీంకోర్టు ఓబీసీ రిజర్వేషన్లలో ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న కుటుంబాలకు వేరు చేయడానికి ‘క్రీమీ లేయర్’ అనే పద్ధతిని ప్రవేశపెట్టింది. అయితే అదే సూత్రాన్ని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వర్తింపజేయరాదని తీర్పు స్పష్టంగా పేర్కొంది. కాలక్రమేణా, రిజర్వేషన్ల ప్రయోజనాలు ఎస్సీ/ఎస్టీలలోని కొన్ని కుటుంబాలకే పరిమితమవుతున్నాయనే చర్చ మొదలైంది
2018లో మొదటి పెద్ద చర్చ
2018లో సుప్రీంకోర్టు SC/ST వర్గాల ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్‌పై విచారణ చేపట్టినప్పుడు, “ఈ వర్గాల్లో కూడా క్రీమీ లేయర్‌ను అమలు చేయాలా?” అన్న ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది. ఆ సమయంలో కోర్టు దీనిపై స్పష్టమైన తీర్పు ఇవ్వకపోయినా, సమాజంలో సమానత్వం, అంతర్గత వెనుకబాటుతనం గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
2022–2023: అంతర్గత వర్గీకరణపై విస్తరించిన చర్చ
2022 నుంచి కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా పంజాబ్, తమిళనాడు, మహారాష్ట్ర ఎస్సీ వర్గాలను అంతర్గతంగా వర్గీకరించే ప్రయత్నాలు ప్రారంభించాయి. దీని ఉద్దేశ్యం చరిత్రాత్మకంగా అత్యంత వెనుకబడి ఉన్న కులాలకు రిజర్వేషన్ ప్రయోజనం ఎక్కువగా చేరేలా చూడడం. ఇలాంటి చర్యల మధ్య ఎస్సీ/ఎస్టీలకు క్రీమీ లేయర్ అవసరమా? అన్న చర్చ మళ్లీ వేగం అందుకుంది.
2024లో ఒక కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్, “వర్గాల్లో క్రీమీ లేయర్‌ను గుర్తించాలి; ఆర్థికంగా, విద్యాపరంగా ముందుకు వచ్చిన కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ తప్పనిసరి అవసరం లేదని పరిగణించవచ్చు” అని వ్యాఖ్యానించారు. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇలా స్పష్టంగా చెప్పడం ఇదే ప్రథమం కావడంతో, ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి.
