
షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్‌కు ‘పసిడి’
షూటింగ్ క్రీడలో భారత యువ కెరటాలు మరోసారి ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. మంగళవారం జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్- 2026 పోటీలలో భారత షూటర్లు ముఖేష్ నెలవల్లి, పాలక్ గులియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ఈ జోడీ కేవలం స్వర్ణ పతకాన్ని గెలవడమే కాకుండా, పాత రికార్డులను తిరగరాస్తూ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ ఏడాది రైఫిల్, పిస్టల్ షూటర్లకు ఇదే తొలి వరల్డ్ కప్ కావడం విశేషం.
నమోదైన రికార్డు స్కోరు
నువ్వా నేనా అన్నట్లు సాగిన ఫైనల్ పోరులో ముఖేష్-పాలక్ జంట 487.7 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన నిగినా సైద్‌కులోవా, ముఖమ్మద్ కమలోవ్ పేరిట ఉన్న పాత రికార్డును (481.3 పాయింట్లు) వీరు అధిగమించారు. ఈ ఏడాది న్యూఢిల్లీలో జరిగిన ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఉజ్బెకిస్తాన్ జంట ఈ రికార్డును సృష్టించగా, నెలల వ్యవధిలోనే భారత్ దానిని చెరిపివేసింది. పసిడి వేటలో భారత్ కంటే వెనుకబడిన చైనాకు చెందిన ప్రపంచ ఛాంపియన్లు యావో కియాన్జున్, హు కాయ్ 484.8 పాయింట్లతో రజతం దక్కించుకోగా, హంగేరీకి చెందిన వెరోనికా మేజర్, అకోస్ కరోలీ నాగి జోడీ 414.9 పాయింట్లతో కాంస్య పతకానికి పరిమితమైంది.
తొలి స్వర్ణంతో మెరిసిన పాలక్, ముఖేష్
ఆసియా క్రీడల ఛాంపియన్‌గా ఇప్పటికే గుర్తింపు పొందిన పాలక్ గులియాకు ప్రపంచ కప్ పోటీల్లో ఇదే తొలి పసిడి పతకం. గతంలో ఆమె ఒక రజతం, ఒక కాంస్యం గెలుచుకోగా, ఇప్పుడు స్వర్ణంతో తన ఖాతాను భర్తీ చేసుకుంది. ఇక మరో షూటర్ ముఖేష్ నెలవల్లికి ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ వేదికపై ఇదే మొట్టమొదటి పతకం కావడం గమనార్హం. అర్హత రౌండ్‌లో 581-17x స్కోరుతో రెండో స్థానంలో నిలిచిన ఈ జంట, తుది పోరులో మాత్రం తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే ఇదే విభాగంలో పోటీపడ్డ మరో భారత జంట సన్యామ్, ఉజ్వల్ మాలిక్ 576-15x స్కోరుతో తొమ్మిదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది.
రైఫిల్ విభాగంలో ఎదురుదెబ్బ
పిస్టల్ విభాగంలో స్వర్ణంతో భారత్ మెరవగా, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో మాత్రం నిరాశే ఎదురైంది. భారత జట్లు కనీసం ఫైనల్‌కు కూడా అర్హత సాధించలేకపోయాయి. సోనమ్ ఉత్తర్ మాస్కర్, గజానన్ ఖండగాలే ద్వయం 631.4 పాయింట్లతో ఆరో స్థానంలో నిలవగా, అర్ష్‌దీప్ సింగ్, శృతి జంట 628.0 స్కోరుతో 19వ స్థానానికి పరిమితమయ్యారు. ఈ ఈవెంట్‌లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధించాయి.
