
షార్ట్ సర్య్కూట్‌తో ఆరుగురు మృతి
జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రి వర్గాలు తెలిపిన కథనం ప్రకారం ట్రామా, న్యూరో సర్జరీ ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగింది. అక్టోబర్ 5, రాత్రి 11:20 సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో ఐసీయూ అంతటా పొగ నిండిపోయింది. న్యూరో సర్జరీ–1లో 11 మంది రోగులు ఉన్నారు. వారిని ఇతర ఐసీయూల్లోకి తరలించారు. అయితే ఈ విషాదంలో ఆరుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. ట్రామా, ఆర్థోపెడిక్ ఇన్సిట్యూట్ లో మొత్తం 284 పడకలు ఉన్నాయి. నాలుగు ఐసీయూలు, ఆరు జనరల్ వార్డుల్లో 46 పడకలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు 250 మంది వరకు రోగులు వస్తుంటారు. ప్రతి రోజు 40 నుంచి 50 వరకు ట్రామా సెంటర్ లో ఆపరేషన్లు జరుగుతుంటాయని తెలిపారు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకుని దాదాపు 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇతర వార్డులకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు.
ప్రధాని విచారం
అయితే ఈ సంఘటనపై దేశ ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా దిగ్బ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఘటన పట్ల తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. అయితే ఈ అగ్నిప్రమాదం రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ మాట్లాడుతూ ప్రభుత్వం మరణించిన వారి కుటుంబాలను ఇప్పటి వరకు పరామర్శించలేదని, వారి బాధలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, ఈ సంఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
