
షార్జాలో తొలి బీడబ్ల్యూఎఫ్ ఎయిర్‌బ్యాడ్మింటన్ వరల్డ్ కప్
బ్యాడ్మింటన్ ఆటను బహిరంగ మైదానాలకు తీసుకెళ్తూ కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. డిసెంబర్ 11 నుంచి 14 తేది వరకు షార్జాలో మొదటి బీడబ్ల్యూఎఫ్ ఎయిర్‌బ్యాడ్మింటన్ వరల్డ్ కప్ జరగనుంది. ఆట చరిత్రలో ఇది చిరస్మరణీయ మైలురాయిగా నిలవనుంది.
ప్రపంచవ్యాప్తంగా కఠినమైన ఎంపిక ప్రక్రియలో అర్హత సాధించిన 12 జాతీయ జట్లు ఈ పోటీలో పాల్గొంటాయి. ఆస్ట్రేలియా, జర్మనీ, అజర్‌బైజాన్, హాంకాంగ్, బ్రెజిల్, ఇండోనేషియా, బల్గేరియా, నైజీరియా, చైనా, యూఏఈ, ఈజిప్ట్, వెనిజులా జట్లు ఈ జాబితాలో ఉన్నాయి.
బీడబ్ల్యూఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు ఆటగాళ్లతో కూడిన మెన్స్ ట్రిపుల్స్, విమెన్స్ ట్రిపుల్స్, టీమ్ రిలే అనే మూడు కొత్త ఫార్మాట్లలో మొత్తం 96 మంది అథ్లెట్లు పోటీ పడతారు. నైపుణ్యం, వేగం, జట్టు కలయికల సమ్మేళనంతో ఈ ఈవెంట్ సాంప్రదాయ ఆటకు కొత్త కోణంను చూపిస్తుంది.
యూఏఈ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ డిప్యూటీ చైర్మన్, షార్జా డిప్యూటీ రూలర్ హిజ్ హైనెస్ షేఖ్ అబ్దుల్లా బిన్ సలేం బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఉత్సాహాన్ని హైలైట్ చేస్తూ బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షురాలు ఖున్యింగ్ పటామా లీస్వాద్‌త్రాకుల్ మాట్లాడుతూ, ఎయిర్‌బ్యాడ్మింటన్ ఆటకు ‘బహిరంగ కొత్త అధ్యాయం’ అని వర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఆటను విస్తరించి, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో రూపొందించినట్లు చెప్పారు.
‘ఈ ఏడాది మేము మొదటి వరల్డ్ సర్క్యూట్ ప్రారంభించాం. సాంప్రదాయ బలమైన దేశాలకు మించి ఇతర సభ్య సంఘాలు, అథ్లెట్లు బీడబ్ల్యూఎఫ్ ఆమోదిత పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించాం’ అని లీస్వాద్‌త్రాకుల్ తెలిపారు. ‘షార్జా వరల్డ్ కప్‌లో ఉన్నత స్థాయి పోటీతో పాటు ఉత్సవ వాతావరణం సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రేక్షకులను చేర్చాలన్నదే మా దృష్టి’ అని అన్నారు. ప్రముఖుల్లో మాజీ మెన్స్ సింగిల్స్ టాప్ 10 ఆటగాడు వాంగ్ వింగ్ కీ విన్సెంట్ హాంకాంగ్ చైనా జట్టును నడిపిస్తాడు. టీమ్ రిలే ఈవెంట్‌లో వీరు ఫేవరెట్స్‌గా భావిస్తున్నారు.
పోటీ ఫార్మాట్
ట్రిపుల్స్‌లో బెస్ట్ ఆఫ్ ఫైవ్ గేమ్స్ నిర్ణయిస్తుంది. ప్రతి గేమ్ 9 పాయింట్లకు. 8-8కి చేరితే రెండు పాయింట్ల ఆధిక్యం అవసరం. 12-12కి వస్తే తర్వాతి పాయింట్ గెలుపు నిర్ణయిస్తుంది. ఒక మ్యాచ్‌కు మూడు సబ్‌స్టిట్యూషన్లు అనుమతి.
టీమ్ రిలేలో నాలుగు మ్యాచ్‌లు, విమెన్స్ డబుల్స్, మెన్స్ డబుల్స్, విమెన్స్ ట్రిపుల్స్, మెన్స్ ట్రిపుల్స్. ప్రతి మ్యాచ్ స్కోరు కలిపి రిలే శైలిలో 60 పాయింట్లు ముట్టిన జట్టు విజేత. ఒక ఆటగాడు ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడవచ్చు.
ఇసుక, గడ్డి లేదా హార్డ్ కోర్టులపై ఆడేందుకు రూపొందిన ఎయిర్‌బ్యాడ్మింటన్... గాలి ప్రభావాన్ని తట్టుకునే ప్రత్యేక ‘ఎయిర్‌షటిల్’ ఉపయోగిస్తుంది. వేగవంతమైన, ప్రేక్షకులకు ఆకర్షణీయమైన ఆటను అందిస్తుంది.
షార్జా ఈ కొత్త ఫార్మాట్‌లో ప్రపంచ ఉత్తములను ఆహ్వానిస్తున్న నేపథ్యంలో... బీడబ్ల్యూఎఫ్ ఎయిర్‌బ్యాడ్మింటన్ వరల్డ్ కప్ ఆట, ఆవిష్కరణ, ఉత్సవాల సమ్మేళనంగా బ్యాడ్మింటన్ భవిష్యత్తుకు మైలురాయిగా నిలవనుంది.
