Let's talk: editor@tmv.in
షాబాద్ నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు

షాబాద్ నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు

Gaddamidi Naveen
14 జులై, 2026

రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం దైవాలగూడలో ఆరుగురి హత్యల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నపి. రాజ్‌కుమార్ (35) మృతదేహం సోమవారం లభ్యమైంది. అతడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం, పి. రాజ్‌కుమార్ రైతుగా జీవనం సాగిస్తున్నాడు. అతనిపై ఈ ఏడాది మే నెలలో పోక్సో చట్టం కింద కేసు నమోదైందన్నారు. ఓ మైనర్ బాలికను వేధించడం, వెంటాడడం వంటి ఆరోపణలపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జూలై 10 రాత్రి రాజ్‌కుమార్ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. మైనర్ బాలికతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులు, అలాగే తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. మొత్తం ఆరుగురిని కత్తితో పొడిచి, గొంతు కోసి చంపినట్లు పోలీసులు తెలిపారు.

హత్యల అనంతరం రాజ్‌కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పినట్లు సమాచారం. తాను కూడా ప్రాణాలు తీసుకుంటానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని పోలీసులు పేర్కొన్నారు. దీంతో అతని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చేపట్టారు.

సోమవారం కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో మృతదేహం కనిపించిందని స్థానికులు డయల్-100కు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం పక్కనే పురుగుమందు సీసా లభ్యమైందన్నారు. మృతుడి నోటిలో నురుగు కనిపించడంతో పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పిలిపించగా, మృతదేహం రాజ్‌కుమార్‌దేనని వారు గుర్తించారు. ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్‌లు
TelanganaRangaReddyCrimeNewsBreakingNewsTelanganaPoliceKothurPOCSOCaseMurderCaseCrimeUpdatePoliceInvestigationTeluguNewsLatestNews
షాబాద్ నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు - Tholi Paluku