Let's talk: editor@tmv.in
షాదీ.కామ్ వ్యవస్థాపకుడికి సుప్రీంకోర్టులో ఊరట

షాదీ.కామ్ వ్యవస్థాపకుడికి సుప్రీంకోర్టులో ఊరట

Pinjari Chand
4 ఫిబ్రవరి, 2026

మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌ షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్‌కు సుప్రీంకోర్టులో కీలక ఊరట లభించింది. నకిలీ ప్రొఫైల్‌ ద్వారా ఓ మహిళను మోసం చేసి రూ.11 లక్షలు వసూలు చేసిన ఘటనకు సంబంధించి నమోదైన కేసులో, మిట్టల్‌తో పాటు మరో ఇద్దరికి రెండు వారాల పాటు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలన్న అనుపమ్ మిట్టల్ అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు తిరస్కరించడాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ వ్యవహారాన్ని సానుకూల అంశాల ఆధారంగా మళ్లీ పునఃపరిశీలించాలని ఆదేశిస్తూ, కేసును తిరిగి తెలంగాణ హైకోర్టుకే పంపించింది. ఈలోగా మిట్టల్‌పై ఎలాంటి బలవంత చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది.

ఈ కేసు నేపథ్యం ఏమిటంటే హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ, షాదీ.కామ్‌లో నకిలీ ప్రొఫైల్ సృష్టించిన వ్యక్తి తనను నమ్మించి రూ.11 లక్షలు మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మోసానికి వేదికగా షాదీ.కామ్ పనిచేసిందని, యూజర్ల వివరాల ధృవీకరణలో ప్లాట్‌ఫామ్ విఫలమైందని ఆరోపిస్తూ అనుపమ్ మిట్టల్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు గతంలో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయడానికి నిరాకరించడంతో, మిట్టల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్‌ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్‌ ఎన్.వి. అంజారియా ధర్మాసనం, హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ కేసును తిరిగి అక్కడికే పంపింది.

విచారణ సందర్భంగా అనుపమ్ మిట్టల్ తరఫున సీనియర్ న్యాయవాది ఆత్మారామ్ నడ్కర్ణి వాదనలు వినిపించారు. షాదీ.కామ్ కేవలం పెళ్లి సంబంధాల కోసం పరిచయ వేదిక మాత్రమే. మేము మ్యాచింగ్ సదుపాయం కల్పిస్తాం. వినియోగదారులు చేసే ప్రతి చర్యకు ప్లాట్‌ఫామ్‌ను బాధ్యుడిగా చేయలేం. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నాం. అయినప్పటికీ నన్ను నేరస్థుడిగా చూపడం అన్యాయమని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు, కేసును మెరిట్స్ ఆధారంగా హైకోర్టే తేల్చాలని పేర్కొంటూ, తాత్కాలికంగా మిట్టల్‌ అరెస్ట్‌కు రక్షణ కల్పించింది. అలాగే, మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఈ తీర్పుతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల బాధ్యతలు, వినియోగదారుల మోసాలపై న్యాయపరమైన పరిధి ఏమిటన్న అంశంపై చర్చకు కొత్త దిశ లభించిందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.