Let's talk: editor@tmv.in
షాంఘై ఎయిర్‌పోర్టులో భారత యువతికి అవమానం

షాంఘై ఎయిర్‌పోర్టులో భారత యువతికి అవమానం

Pinjari Chand
25 నవంబర్, 2025

చైనా–భారత్‌ సంబంధాలు ఇటీవల కొద్దిగా సర్దుబాటు దిశగా సాగుతున్న తరుణంలో షాంఘైలో ఒక భారత మహిళకు జరిగిన అవమానకర ఘటన తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. లండన్‌లో నివసిస్తున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ యువతి ప్రేమా వాంగ్‌జోం థోంగ్‌డాక్‌ షాంఘై పుడాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం చైనా ఇమిగ్రేషన్‌ నుంచి ఎదుర్కొన్న వేధింపుల వివరాలను బయటపెట్టింది.

నీ పాస్‌పోర్ట్‌ చెల్లదు… నువ్వు ఇండియన్‌ కాదు

లండన్‌ నుంచి జపాన్‌ వెళ్తూ షాంఘైలో ట్రాన్సిట్‌ తీసుకున్న ప్రేమాను ఒక మహిళా ఇమిగ్రేషన్‌ అధికారి క్యూలో నుంచే బయటకు తీసుకెళ్లి ప్రశ్నలు ప్రారంభించిందని ఆమె తెలిపింది. అరుణాచల్‌ ఇండియాలో లేదు. చైనాలో భాగం. నువ్వు ఇండియన్‌ ఎలా అవుతావు? నీ వీసా చెల్లదు, నీ పాస్‌పోర్ట్‌ కూడా చెల్లదు అంటూ నవ్వులతో, హేళనలతో తనను ఇబ్బంది పెట్టారని ప్రేమా చెప్పింది అవమానాన్ని తట్టుకోలేక ప్రశ్నిస్తే చైనా పాస్‌పోర్ట్‌ కోసం అప్లై చేయి, నువ్వు చైనా వారివే అంటూ మరింతగా వేధించారని ఆమె ఆరోపించింది.

ఏకంగా ఎయిర్‌లైన్‌ సిబ్బందే జోకులు

చైనా ఈస్ట్రన్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది కూడా ఇమిగ్రేషన్‌తో కలిసి ప్రేమాపై ఎగతాళిగా మాట్లాడుతూ అరుణాచల్‌… చైనాలో ఉంది. ఇండియాలో కాదు అని హేళన చేశారని, నవ్వులు పేల్చారని, ఇది తాను ఎన్నడూ ఊహించని అవమానం అని చెప్పింది. నా కుటుంబంతో సంప్రదించలేకపోయాను. ఎవరూ సహాయం చేయలేదు. వారు మాట్లాడుకుంటూ, నవ్వుతూ నాపై ఎగతాళి చేస్తూ ‘చైనా, చైనా’ అనడం చాలా బాధాకరం అని ఆమె పేర్కొంది.

18 గంటల నరకయాతన

ఇదంతా జరుగుతుండగా ఆమెను ఎయిర్‌పోర్టులోనే గంటల తరబడి నిలిపారని, ఎలాంటి స్పష్టమైన కారణమూ చెప్పలేదని ప్రేమా చెప్పింది. మొత్తం 18 గంటలు అక్కడే ఇరుక్కుపోయిన పరిస్థితి అని వివరించింది.

భారత రాయబారుల చొరవ

చివరికి ఆమె షాంఘై, బీజింగ్‌ భారత రాయబార కార్యాలయాలకు ఫోన్‌ చేయడంతో పరిస్థితి మారింది. కాల్‌ చేసిన గంటలోపే భారత అధికారులు ఎయిర్‌పోర్టుకే చేరుకొని, ఆమెకు ఆహారం అందించి, చైనా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. రాయబార అధికారులు రాకపోతే ఏం జరిగేదో తెలియదు. వారు వచ్చాకే పరిస్థితి సద్దుమణిగింది అని ప్రేమా తెలిపింది.

అరుణాచల్‌ విషయంలో భారత్‌ స్పష్టం

ఈ ఘటన చైనా ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌పై పేర్లు పెట్టే ప్రయత్నాలు చేస్తోన్న సమయంలో రావడం గమనార్హం. అరుణాచల్‌ ప్రదేశ్‌ భారతదేశానికి అంతర్భాగం. చైనా పెట్టే పేర్లు వాస్తవాన్ని మార్చలేవు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్‌ జైస్వాల్‌ ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేశారు. చైనా ఇమిగ్రేషన్‌ చేసిన ఈ వ్యవహారం పట్ల భారత్‌ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. అంతర్జాతీయ ప్రయాణాల్లో భారత పౌరుల భద్రతపై ఇలాంటి అవమానాలు వెలుగులోకి రావడం ఆందోళనకు గురిచేస్తోంది.