
షహీది గురుపురబ్ ఉత్సవాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్‌కు ఆహ్వానం
షహీది గురుపురబ్ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పంజాబ్ రాష్ట్ర మంత్రులు ఆహ్వానించారు. గురు తేజ్ బహదూర్ జీ త్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ పవిత్రమైన కార్యక్రమానికి రావాల్సిందిగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
పంజాబ్ పరిశ్రమల శాఖ మంత్రి సంజీవ్ అరోరా, వ్యవసాయ శాఖ మంత్రి గుర్మీత్ ఖుద్దియాన్ శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గురు తేజ్ బహదూర్ జీ చరిత్ర, ఆయన త్యాగం, షహీది గురుపురబ్ ఉత్సవాల ప్రాముఖ్యతను గురించి ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే నెలలో జరిగే గురుతేజ్ బహదూర్ జీ350వ అమరవీరుల వార్షికోత్స వేడుకల్లో (గురుపురబ్) పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించారు. ఈ ఉత్సవాలకు హాజరు కావడం ద్వారా దేశంలో సాంస్కృతిక, మత సామరస్యాన్ని పెంపొందించేందుకు తమ సహకారాన్ని అందించాలని వారు రేవంత్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు శాసనసభ్యుడు దొంతి మాధవ్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా సిక్కులు షహీది గురుపురబ్ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పంజాబ్ మంత్రులు ఆహ్వానించడం రెండు రాష్ట్రాల మధ్య సౌభ్రాతృత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని పంచుకునేందుకు ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది.
షహీది గురుపురబ్ ప్రాముఖ్యత
షహీది గురుపురబ్ సిక్కు మత స్థాపకులలో ఒకరైన గురు తేజ్ బహదూర్ త్యాగాన్ని స్మరించుకునే ఉత్సవం. గురు తేజ్ బహదూర్ జీ సిక్కుల తొమ్మిదవ గురువు, గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఆయన తన జీవితాన్ని ధ్యానం, మానవ సేవల కోసం అంకితం చేశారు. ఆయన ప్రధాన ఆదర్శం మత స్వేచ్ఛ, మానవ హక్కుల పరిరక్షణ. ఎవరైనా సరే, తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా అనుసరించే హక్కు ఉండాలని నమ్మారు.
ఆయన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు బలవంతపు మత మార్పిడులను వ్యతిరేకించారు. ముఖ్యంగా కాశ్మీరీ పండిట్‌ల మత స్వేచ్ఛ కోసం నిలబడి, చివరికి ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో బలిదానం చేశారు. ధర్మ రక్షణ కోసం ప్రాణాలర్పించినందుకు ఆయనను "హింద్ కీ చాదర్" అని పిలుస్తారు. ఆయన రాసిన అనేక పవిత్ర శ్లోకాలు సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌లో “గురు గ్రంథ్ సాహిబ్”లో ఉన్నాయి.
