Let's talk: editor@tmv.in
షర్మిల రాజకీయ వైఖరి చంద్రబాబు ప్రయోజనాలకే: వైసీపీ నేత సతీష్ రెడ్డి

షర్మిల రాజకీయ వైఖరి చంద్రబాబు ప్రయోజనాలకే: వైసీపీ నేత సతీష్ రెడ్డి

Panthagani Anusha
21 మార్చి, 2026

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించింది. ఆమె స్వతంత్రంగా వ్యవహరించడం లేదని, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు “రాజకీయ వాయిస్‌పీస్”లా మారిపోయారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో షర్మిల వెచ్చించిన భారీ నిధుల ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నేతల అడుగులు వారి రాజకీయ వ్యూహాలు అన్నీ చంద్రబాబు ప్రయోజనాలకు అనుగుణంగానే సాగుతున్నాయని సతీష్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ఖర్చుల కోసం షర్మిలకు నిధులు చంద్రబాబు నుంచే అందాయా? అన్న సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా షర్మిల, సునీతలను చంద్రబాబు పావులుగా వాడుకున్నారని దీనికి కొన్ని మీడియా సంస్థలు వత్తాసు పలికాయని ఆయన దుయ్యబట్టారు.

వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు అంశాన్ని కూడా సతీష్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఈ కేసు విచారణను ఉద్దేశపూర్వకంగానే 2029 ఎన్నికల వరకు సాగదీసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటున్న తిరుమల లడ్డూ వివాదం, టీటీడీ చైర్మన్ వ్యవహారం, అదేవిదంగా టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు సంబంధించిన డ్రగ్స్ కేసు వంటి కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే మళ్లీ వివేకా కేసును తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. వై.ఎస్. సునీత ద్వారా పిటిషన్లు వేయించడం వెనుక టీడీపీ వ్యూహకర్తల హస్తం ఉందని ఆరోపించారు.

అదేవిధంగా కుటుంబ ఆస్తుల వివాదంపై స్పందిస్తూ షర్మిల ఇప్పటికే కుటుంబ ఆస్తుల్లో సింహభాగం పొందినప్పటికీ ఇంకా తన సోదరుడిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వివాహం జరిగిన చాలా కాలం తరువాత ఇప్పుడు అదనపు వాటాలు కోరడం ప్రజల్లో అనుమానాలకు దారి తీస్తోందన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని షర్మిల, సునీతలు నిజంగా నిజాయితీగా ఉంటే బహిరంగ చర్చకు రావాలని లేదా దేవుని ముందు ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు. అవినాష్ రెడ్డి ఈ సవాల్‌కు సిద్ధంగా ఉన్నారని వారు సిద్ధమేనా అని ప్రశ్నించారు.

కాగా చంద్రబాబు పన్నిన రాజకీయ ఉచ్చులో పడి షర్మిల, సునీతలు సొంత కుటుంబాన్ని బజారున పడేయవద్దని సతీష్ రెడ్డి హెచ్చరించారు. 2029 ఎన్నికల రాజకీయ లబ్ధి కోసమే ఈ కేసును, కుటుంబ కలహాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, ప్రజలు ఈ వాస్తవాలను గమనిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

షర్మిల రాజకీయ వైఖరి చంద్రబాబు ప్రయోజనాలకే: వైసీపీ నేత సతీష్ రెడ్డి - Tholi Paluku