
షఫాలీ వర్మకు ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ, గత నెలలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించినందుకు గాను, నవంబర్ 2025 నెలకు సంబంధించిన ఐసీసీ 'ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డును గెలుచుకుంది. షఫాలీకి ఇది కెరీర్‌లో మొదటి ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు కావడం విశేషం.
ఈ అవార్డును గెలుచుకోవడంలో ఆమె థాయిలాండ్‌కు చెందిన తిపచా పుత్తావోంగ్, యూఏఈకి చెందిన ఈషా ఓజాలను అధిగమించింది. టోర్నీ చివర్లో ప్రతీక రావల్ గాయపడటంతో షఫాలీ వర్మ అనుహ్యంగా భారత మహిళల ప్రపంచ కప్ జట్టులోకి వచ్చింది. ఫైనల్ మ్యాచ్‌లో షఫాలీ కేవలం 78 బంతుల్లో 87 పరుగులు చేసింది. ఈ స్కోరులో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇది మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత ఓపెనర్ చేసిన అత్యధిక స్కోరుగా నిలిచింది. 21 ఏళ్ల ఈ యువ క్రీడాకారిణి మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ మొత్తం స్కోరు 298/7 పరుగులకు చేరుకుంది. బ్యాటింగ్‌తో పాటు, బౌలింగ్‌లోనూ షఫాలీ కీలకమైన రెండు వికెట్లు తీసింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ సునే లూస్, అలాగే కీలక క్రీడాకారిణి మరిజానే కాప్ వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అందుకే ఆమెకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
షఫాలీ స్పందన
ఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో షఫాలీ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. "నా మొదటి ఐసీసీ మహిళల ప్రపంచ కప్ అనుభవం నేను మొదట్లో ఊహించినంత బాగా జరగకపోయినా, అది నేను కోరుకున్నదానికంటే చాలా అద్భుతంగా ముగిసింది” అని అన్నారు. "ఫైనల్‌లో టీమ్ విజయంలో నేను సహాయపడినందుకు, సొంత ప్రేక్షకుల ముందు మొదటిసారిగా ప్రపంచ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన బృందంలో భాగమైనందుకు నేను చాలా కృతజ్ఞురాలిని” అని ఆమె తెలిపారు.
"నవంబర్ నెలకు 'ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా ఎంపిక కావడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డును నా సహచరులు, కోచ్‌లు, కుటుంబ సభ్యులకు, నా ప్రయాణానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తున్నాను. మేము ఒక జట్టుగా గెలుస్తాం, ఓడిపోతాం. ఈ అవార్డుకు కూడా అదే వర్తిస్తుంది” అని షఫాలీ అన్నారు.
త్వరలో శ్రీలంకతో సిరీస్
మహిళల టీ20 అంతర్జాతీయ సిరీస్ కోసం శ్రీలంకతో త్వరలో జరగబోయే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది భారత జట్టులో షఫాలీ వర్మ కూడా ఉంది. ఈ సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది.
పురుషుల విభాగంలో..
పురుషుల విభాగంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసినందుకు అతనికి ఈ గౌరవం దక్కింది. ఆ సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0 తేడాతో గెలుచుకుంది. 36 ఏళ్ల హార్మర్ ఆ సిరీస్‌లో మొత్తం 17 వికెట్లు తీశాడు. 25 ఏళ్ల తర్వాత భారత్‌లో దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌ను గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
