Let's talk: editor@tmv.in
షుగర్ మిల్లు ఎక్కడ ప్రధాని గారూ?

షుగర్ మిల్లు ఎక్కడ ప్రధాని గారూ?

Pinjari Chand
16 సెప్టెంబర్, 2025

ప్రధాని నరేంద్ర మోడీ కేవలం రాజకీయ కారణాలతోనే ఇక్కడికి వస్తారని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని, వాటిని నమ్మే స్థితిలో బీహర్ ప్రజలు లేరని లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీ బహిష్కృత నాయకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విమర్శించారు. రానున్న ఎన్నికల కోసమే ఇక్కడ చక్కర్లు కొడుతున్నారని ఆరోపించారు. ఇటీవల అనేక ప్రాజెక్టులు, పనులకు శంకుస్థాపనలు చేసి ఇక్కడి ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారని వివరించారు.

నాడు ప్రారంభించిన చక్కెర ఫ్యాక్టరీ ఎక్కడ

2020 శాసనసభ ఎన్నికల సయమంలోనూ ప్రధాని నరేంద్ర మోడీ పలు ప్రాజెక్టులను ప్రారంభించారని, అనేక అబద్దపు మాటలు చెప్పారని, ఈ ప్రాంతంలో చక్కెర ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని, నేటికీ అక్కడ ఒక్క ఇటుకను కూడా పేర్చలేదని గుర్తు చేశారు. ఇలాంటి అబద్దపు హామీలు ఇస్తూ పోతే దేశ ప్రజలు కూడా నమ్మరని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఇక్కడ ప్రధాని మోడీ వంతెనలు, విమానాశ్రయాలు ప్రారంభిస్తున్నారని, ఇప్పుడు ఇక్కడ కావాల్సింది సహాయం అని అన్నారు. వరదలు వచ్చి జవానియా గ్రామం పూర్తిగా కొట్టుకుపోయిందని, వారి రోదనలను విని, వారిని ఆదుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సహయక చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. రఘోపూర్ లో కూడా వరద సహాయక చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ప్రధానిని తేజ్ ప్రతాప్ కోరారు.

షుగర్ మిల్లు ఎక్కడ ప్రధాని గారూ? - Tholi Paluku