Let's talk: editor@tmv.in
షక్స్‌గామ్ వ్యాలీ మాదే, భారత్‌ది కాదు: చైనా

షక్స్‌గామ్ వ్యాలీ మాదే, భారత్‌ది కాదు: చైనా

Shaik Mohammad Shaffee
13 జనవరి, 2026

భారత భూభాగమైన షక్స్‌గామ్ వ్యాలీ విషయంలో చైనా తన దుందుడుకు స్వభావాన్ని మరోసారి ప్రదర్శించింది. ఈ వ్యూహాత్మక ప్రాంతంలో చైనా చేపడుతున్న మౌలిక సదుపాయాల కల్పనపై భారత్ వ్యక్తం చేసిన తీవ్ర నిరసనను బీజింగ్ తోసిపుచ్చింది. షక్స్‌గామ్ లోయ తమ దేశంలో భాగమని, అక్కడ తాము చేసే పనులు "తప్పుబట్టదగ్గవి కావు" అంటూ చైనా విదేశాంగ శాఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి.

అసలేమిటి ఈ వివాదం?

భారతదేశానికి చెందిన జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లోని షక్స్‌గామ్ లోయను పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకుంది. అయితే 1963లో పాక్ తన స్వార్థ ప్రయోజనాల కోసం సుమారు 5,180 చదరపు కిలోమీటర్ల ఈ భారత భూభాగాన్ని చైనాకు అక్రమంగా ధారాదత్తం చేసింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంపై చైనా తన పట్టు పెంచుకుంటూ వస్తోంది. తాజాగా అక్కడ చైనా భారీగా రోడ్లు, భవనాలు నిర్మిస్తుండటంతో భారత్ తీవ్రంగా మండిపడింది.

అది మా అంతర్భాగం: భారత్

భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గత శుక్రవారం చైనా చర్యలను తీవ్రంగా ఖండించారు. "షక్స్‌గామ్ లోయ భారత భూభాగం. 1963 నాటి చైనా-పాక్ సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఎన్నడూ గుర్తించలేదు. అది చట్టవిరుద్ధం, చెల్లనిది. మా భూభాగంలో చైనా జోక్యాన్ని సహించేది లేదు. దేశ ప్రయోజనాల కోసం ఎలాంటి చర్యలకైనా మేము సిద్ధం" అని ఆయన స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్‌కు విడదీయరాని, అవిభాజ్య భాగాలని ఆయన పునరుద్ఘాటించారు.

చైనా ఎదురుదాడి

భారత్ అభ్యంతరాలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ బీజింగ్‌లో స్పందించారు. "ముందుగా ఒకటి స్పష్టం చేయాలి.. మీరు (భారత్) చెబుతున్న ఆ ప్రాంతం చైనా భూభాగంలోనే ఉంది. మా సొంత భూమిలో మౌలిక వసతులు కల్పించుకునే సర్వ హక్కులు మాకు ఉన్నాయి" అని ఆమె వాదించారు. సార్వభౌమ దేశాలైన పాక్-చైనాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని ఆమె చెప్పుకొచ్చారు.

సీపెక్‌పై మొండి వాదన

భారత భూభాగం గుండా వెళ్తున్న చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్)ను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే ఇది కేవలం స్థానిక ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమమేనని చైనా మళ్లీ పాత పల్లవినే అందుకుంది. ఈ ప్రాజెక్టు వల్ల కాశ్మీర్ విషయంలో తమ తటస్థ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని చైనా బుకాయించింది. కాశ్మీర్ వివాదాన్ని ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం శాంతియుతంగా పరిష్కరించుకోవాలంటూ సలహా ఇచ్చింది.

దౌత్య వర్గాల ఆందోళన

భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని హెచ్చరిస్తుంటే, చైనా మాత్రం తన ఆక్రమణలను సమర్థించుకుంటోంది. ముఖ్యంగా సియాచిన్ గ్లేసియర్‌కు సమీపంలో ఉన్న ఈ షక్స్‌గామ్ లోయలో చైనా రోడ్లు నిర్మించడం భారత భద్రతకు పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. చైనా మొండివైఖరి కొనసాగితే రాబోయే రోజుల్లో సరిహద్దుల్లో పరిస్థితులు మరింత జటిలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

షక్స్‌గామ్ వ్యాలీ మాదే, భారత్‌ది కాదు: చైనా - Tholi Paluku