Let's talk: editor@tmv.in
శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం మెరుగైందని బీసీసీఐ అధికారిక ప్రకటన

శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం మెరుగైందని బీసీసీఐ అధికారిక ప్రకటన

Yellarthi Chennabasava
2 నవంబర్, 2025

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో గాయపడి ఆసుపత్రిలో చేరిన భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం మెరుగైందని భారత క్రికెట్ బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో అక్టోబర్ 25న జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ, ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో కింద పడటంతో అయ్యర్ ప్లీహ భాగంలో తీవ్రమైన గాయానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన ప్లీహం వద్ద దెబ్బ తగిలి అంతర్గత రక్తస్రావం ప్రారంభమైంది.

గాయం తీవ్రతను గుర్తించిన వైద్య బృందం తక్షణమే అయ్యర్‌ను సిడ్నీలోని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించింది. వైద్యులు వెంటనే రక్తస్రావాన్ని నియంత్రించడానికి చిన్నపాటి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ శస్త్రచికిత్స విజయవంతమవడంతో రక్తస్రావం ఆగిపోయిందని బోర్డు వెల్లడించింది.

బీసీసీఐ ప్రకారం, అయ్యర్ చికిత్సను సిడ్నీలోని నిపుణ వైద్యులు, భారత బోర్డు మెడికల్ టీం సమన్వయంతో అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, కోలుకునే ప్రక్రియ వేగంగా సాగుతున్నదని బోర్డు ప్రకటించింది. వైద్యుల సూచనల మేరకు అయ్యర్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపింది.

అయితే, అయ్యర్ వెంటనే స్వదేశానికి తిరిగి రాలేరు. వైద్యుల పర్యవేక్షణలో మరికొన్ని రోజులు సిడ్నీలోనే ఉండి ఫాలో-అప్ ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. పూర్తిగా కోలుకున్న తర్వాత, విమాన ప్రయాణానికి అనుమతి లభించిన వెంటనే ఆయన భారత్‌కు తిరిగి వస్తారని బోర్డు స్పష్టం చేసింది.

బీసీసీఐ తన ప్రకటనలో అయ్యర్ చికిత్సలో సహకరించిన సిడ్నీ వైద్య నిపుణులు, ముఖ్యంగా డాక్టర్ కౌరూష్ హఘిగి, అలాగే భారత వైద్య నిపుణుడు డాక్టర్ దిన్షా పార్దివాలా బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీసీఐ వైద్య బృందం ఇరు దేశాల నిపుణులతో నిరంతరంగా సంప్రదింపులు కొనసాగిస్తోందని పేర్కొంది.

అయ్యర్ కనీసం రెండు నెలలపాటు ఆటకు దూరంగా ఉండవచ్చని సమాచారం. ఆయన లేని సమయంలో భారత జట్టు రాబోయే వైట్-బాల్ సిరీస్‌లకు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.

శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం మెరుగైందని బీసీసీఐ అధికారిక ప్రకటన - Tholi Paluku