
శ్రీ సత్య సాయి శత జయంతి ఉత్సవాలు: హాజరైన ఉపరాష్ట్రపతి, సీఎం
భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో హిల్‌వ్యూ స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగాయి. నిస్వార్థ సేవ, విద్య, మానవతా కార్యక్రమాల కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన ఈ ఆధ్యాత్మిక గురువు 100వ జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతదేశ ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్. ఇంద్రసేనా రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
సాయిబాబా బోధనలు యుగయుగాలకూ మార్గదర్శకం: ఉపరాష్ట్రపతి
సభను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, భగవాన్ సత్యసాయిబాబా బోధనలు కాలం, దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. ప్రేమ, నిస్వార్థ సేవ, మానవతా విలువలకు జీవం పోసిన ఆధ్యాత్మిక మహనీయుడిగా సాయిబాబా నిలిచారని అన్నారు. విద్య, ఆరోగ్యం, సేవా రంగాల్లో ఆయన చేపట్టిన కార్యక్రమాలు ప్రభుత్వాలు కూడా అనుసరించదగిన మోడల్‌గా ఉన్నాయని రాధాకృష్ణన్ తెలిపారు. సాయిబాబా చూపిన మార్గం నేటి సమాజంలోనూ సమన్వయం, శాంతి, సహజీవనానికి పునాది అయి నిలుస్తోందని అభిప్రాయపడ్డారు.
సత్యసాయిబాబాను శాంతి, ప్రేమ, నిస్వార్థ సేవకు ప్రతిరూపమైన మహానుభావుడిగా కొనియాడారు. “లవ్ ఆల్, సర్వ్ ఆల్”, “హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్” వంటి బాబా బోధనలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రేరేపిస్తున్నాయని చెప్పారు. కులం, మతం, జాతీయత అనే భేదాలకు అతీతంగా మానవత్వాన్ని ఉన్నత స్థాయికి చేర్చేందుకు బాబా జీవితాన్ని అర్పించారని గుర్తుచేశారు. నేటి కలతలతో కూడిన ప్రపంచంలో విభేదాలకు బదులుగా సామరస్యం, స్వార్ధానికి బదులుగా త్యాగం అవసరమని ఆయన పిలుపునిచ్చారు.తెలుగు గంగా కాలువ పునరుద్ధరణలో సత్యసాయిబాబా చేసిన కీలక జోక్యం వల్ల చెన్నైకు త్రాగునీటి సరఫరా సాధ్యమైందని, తమిళనాడు ప్రజలు దీనిని ఎంతో కృతజ్ఞతగా గుర్తు చేసుకుంటారని రాధాకృష్ణన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఉచిత, విలువల ఆధారిత విద్య, గ్రామీణ ఆరోగ్య సేవలు, మానవతా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అనేక జీవితాలకు ఆశాకిరణంగా నిలుస్తున్నాయని చెప్పారు.
సేవా మార్గం యువతలో నింపాలి: సీఎం నాయుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పుట్టపర్తిని ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో నిలబెట్టింది భగవాన్ దూరదృష్టి అని అన్నారు. విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులు, భక్తులకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు కూడా ఉచిత సేవలను అందించడం సత్యసాయి సేవా సిద్ధాంతానికి నిదర్శనమని పేర్కొన్నారు. యువతరాన్ని సేవా మార్గం వైపు దారితీసే బాధ్యత సమాజంపై ఉందని సీఎం పిలుపునిచ్చారు. సత్యసాయి నీటి పథకాలు వేలాది గ్రామాలకు జీవనాడిగా మారాయని గుర్తుచేశారు.
మన ముందు నడయాడిన దైవం, భగవాన్ శ్రీ సత్య సాయిబాబా చూపిన విశిష్ట సేవా మార్గాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.సాయిబాబా కేవలం ఆధ్యాత్మిక మార్గదర్శిగానే కాకుండా, సామాజిక సంస్కర్తగా కూడా నిలిచారు.అందరినీ ప్రేమించు... అందరినీ సేవించు అనే సందేశాన్ని ఇచ్చి, మానవ సేవే మాధవ సేవ అని నమ్మి, ఆచరించి నిరూపించారు.పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్వానికి కేంద్రంగా మార్చారు అని ఆయన అన్నారు.విద్య, వైద్యం, తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చే కార్యక్రమాలతో కోట్ల మంది జీవితాల్లో గుణాత్మక మార్పులు తెచ్చారు.ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గం, అసాధారణ శక్తులు సమస్యలకు పరిష్కారంతో సాయిబాబా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేశారు.ఆ మహనీయుని శత జయంతి ఉత్సవాల సందర్భంగా, శ్రీ సత్య సాయిబాబా మరొక్కమారు దివ్యాంజలి ఘటిస్తూ, ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని సీఎం కోరారు.సాయిబాబా తన జీవితకాలంలో అనేక కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు. ఆయన సాయి సిద్ధాంతం ద్వారా ప్రపంచానికి జ్ఞానాన్ని, సన్మార్గాన్ని చూపించారు అని ఆయన పేర్కొన్నారు.
సాంస్కృతిక కచేరీలు… సేవా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి
శతజయంతి సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకునేలా చేశాయి. భజన బృందాల గానం, వేదపఠనం, ఆధ్యాత్మిక సంగీత కచేరీలు పుట్టపర్తి వాతావరణానికి మరింత పండగాను తెచ్చాయి. సత్యసాయి జీవితం, సందేశం, సేవా ప్రాజెక్టులను ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శనలను సందర్శించిన భక్తులు ప్రశంసలు కురిపించారు. సాయిబాబా ఆశయాలపై రూపొందించిన డాక్యుమెంటరీలు ప్రదర్శించగా, విదేశీ భక్తుల పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భక్తుల సందడి… శాంతి సందేశంతో ముగింపు
దేశవ్యాప్తంగా వేలాది భక్తులు తరలివచ్చి ధ్యానం, ప్రార్థనల్లో పాల్గొన్నారు. భగవాన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన బోధనలను జీవన విధానంగా మార్చుకోవాలని సంకల్పించారు. సాయిబాబా చూపిన నిస్వార్థ సేవా మార్గమే సమాజాన్ని ముందుకు తీసుకెళ్లగలదని నిర్వాహకులు తెలిపారు. చివరలో విశ్వసౌభ్రాతృత్వం, శాంతి, సామరస్యం సందేశంతో కార్యక్రమం ముగిసింది. అత్యంత సమన్వయంతో శతజయంతి నిర్వహించినందుకు నిర్వాహకులను ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి అభినందించారు. పుట్టపర్తిలో జరిగిన ఈ శతజయంతి వేడుకలు భగవాన్ మహోన్నత సేవలకు నివాళి మాత్రమే కాకుండా, మానవతా విలువలను మరింత బలపరిచే వేదికగా నిలిచాయి.
