
శ్రీ సత్య సాయిబాబా ఆశయాల విస్తరణకు తెలంగాణ సిద్ధం: సీఎం
భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, సాయిబాబా ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లో విస్తృతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. సాయిబాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు.
పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తదితరులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
“ప్రేమతో గెలిచిన మహానుభావుడు”
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,మానవ రూపంలోని దేవుడు శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ప్రకటించారు. సాయిబాబా సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. సాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారు. ప్రేమతో మనుషులను గెలిచారు. సేవలతో దేవుడిగా కొలువబడుతున్నారు. ప్రేమ గొప్పది. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించారు అని ముఖ్యమంత్రి కొనియాడారు. సాయిబాబా మన మధ్యన లేకపోయినా, వారిచ్చిన స్ఫూర్తి నిర్వాహకులందరిలో కనిపిస్తోందని చెప్పారు.
కేజీ నుంచి పీజీ వరకు... బాబా ఆశీస్సులు
ప్రభుత్వాలతో పోటీ పడి పేద విద్యార్థులకు సాయి బాబా అందించిన ఉచిత విద్య సేవలను సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు.ప్రతీ పిల్ల చదవాలి అని భావించి, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యనందించారు. వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారు అని పేర్కొన్నారు.అలాగే ఉచిత వైద్యం, తాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా లక్షలాది ప్రజలకు మేలు చేశాయని వివరించారు. పాలమూరు వలసల జిల్లాగా ఉన్న కాలంలో, కరువు కాటకాలు కుంగదీసిన సమయంలో, ప్రభుత్వం కూడా తాగునీరు అందించలేని సమయంలో మా జిల్లాకు నీటి ఊటగా నిలిచారు సాయి బాబా అని సీఎం అన్నారు. అలాగే అనంతపురం, తమిళనాడులోనూ తాగునీటి సౌకర్యాల కోసం బాబా చేపట్టిన సేవా కార్యక్రమాలు ప్రజలకు జీవనాధారంగా మారినట్లు గుర్తు చేశారు.
‘మానవ సేవే మాధవ సేవ’ – ఆచరణలో నిరూపణ
సాయి బాబా బోధించిన ‘మానవ సేవే మాధవ సేవ’ భావజాలం కేవలం ఉపన్యాసం కాదని, జీవన విధానమని సీఎం పేర్కొన్నారు. ప్రపంచంలోని 140 దేశాల్లో సాయిబాబా భక్తులు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారంటే, సాయి సందేశం ఎంత విశ్వవ్యాప్తమైందో అర్థమవుతుందని సీఎం అన్నారు. శత జయంతి వేడుకలకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, దాదాపు 40 నుంచి 50 దేశాల ప్రతినిధులు హాజరవడమే సాయి ప్రభావానికి నిదర్శనం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం అండగా
సత్య సాయిబాబా ఆలోచనలు, విధానాలు ప్రజల్లోకి చేరేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. సాయి బాబా చూపించిన మార్గం మన సమాజానికి శాశ్వత దిశ అని సీఎం స్పష్టం చేశారు. వేడుకల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సాయి కుల్వంత్ హాలులోని సత్య సాయిబాబా మహాసమాధిని దర్శించుకుని నివాళులు అర్పించారు.
