Let's talk: editor@tmv.in
శ్రీ వేంకటేశ్వర దివ్యక్షేత్రానికి గువాహటిలో 25 ఎకరాలు

శ్రీ వేంకటేశ్వర దివ్యక్షేత్రానికి గువాహటిలో 25 ఎకరాలు

Panthagani Anusha
22 డిసెంబర్, 2025

గువాహటిలో శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం నిర్మాణానికి కేటాయించిన భూమిని దాదాపు 11 ఎకరాల నుంచి 25 ఎకరాలకు పెంచేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శనివారం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తికి స్పందనగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది.

భూమి కేటాయింపును పెంచడమే కాకుండా ప్రతిపాదిత ఆలయాన్ని గువాహటిలోనే కొనసాగించడంతో పాటు భూమి అభివృద్ధి పనులకు అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు కూడా అస్సాం ప్రభుత్వం అంగీకరించినట్లు టీటీడీ అధికారిక ప్రకటనలో వెల్లడైంది.

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం గతంలో గువాహటిలో 10.8 ఎకరాల భూమిని ఆలయ నిర్మాణానికి కేటాయించారు. అయితే, గార్చుక్ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న శ్రీ బాలాజీ ఆలయం, సాంస్కృతిక సముదాయం అభివృద్ధిపై ప్రభావం పడుతుందన్న కారణంతో ఈ ప్రాజెక్టును ఇతర ప్రాంతాలకు తరలించాలని అస్సాం ప్రభుత్వం సూచించింది.

కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో కొత్తగా శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల గార్చుక్ బాలాజీ ఆలయానికి ఇబ్బందులు కలగవచ్చని భావించిన అస్సాం ప్రభుత్వం, ఈ ఆలయాన్ని సిల్చార్ లేదా డిబ్రూగఢ్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలకు మార్చాలని ప్రతిపాదించింది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని స్వయంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ దృష్టికి తీసుకెళ్లారు. ఆలయాన్ని గువాహటిలోనే కొనసాగించాలని, భూమి కేటాయింపును మరింత పెంచాలని కోరుతూ ఆయన లేఖ రాశారు.

దీనికి సానుకూలంగా స్పందించిన అస్సాం ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన 10.8 ఎకరాల బదులు గువాహటిలోనే 25 ఎకరాల భూమిని శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం నిర్మాణానికి కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.

ఇదిలా ఉండగా అమరావతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 25 ఎకరాల భూమిని కేటాయించిన విషయాన్ని చంద్రబాబు నాయుడు అస్సాం సీఎంకు గుర్తు చేశారు. అదే తరహాలో గువాహటిలో కూడా సమాన విస్తీర్ణంలో భూమి కేటాయించాలని ఆయన కోరారు.

డిసెంబర్ 18న రాసిన లేఖలో, దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో కనీసం ఒక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేసి హిందూ సనాతన ధర్మం మహిమను విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీటీడీ కట్టుబడి ఉన్నాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఈశాన్య భారతానికి గువాహటి ప్రధాన కేంద్రమైనందున, భక్తులకు అవసరమైన వసతులు, అన్నదానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కూడిన దివ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేయడానికి సుమారు 25 ఎకరాల భూమి అవసరమని ఆయన లేఖలో స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రతిపాదిత భూమిలో అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఆర్థిక సహాయం అందించాలని కూడా అస్సాం ప్రభుత్వాన్ని కోరారు.

చంద్రబాబు నాయుడు చేసిన సూచనలకు అనుగుణంగా, గువాహటిలోనే టీటీడీకి 25 ఎకరాల భూమి కేటాయింపునకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఆమోదం తెలిపారని అవసరమైన అభివృద్ధి పనులకు ఆర్థిక సహకారం అందించేందుకు కూడా అంగీకరించినట్లు టీటీడీ ప్రకటించింది.

తిరుమల తిరుపతి దేవస్థానాలు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి అధికారిక నిర్వాహక సంస్థ కాగా ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్న హిందూ దేవాలయంగా ఖ్యాతి గడించింది.