
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు భూగర్భ జలాల పెంపుతో ప్రత్యేక గుర్తింపు
దేశ స్థాయిలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. జల్ సంచయ్ జన్ భగీదారీ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాల పెంపుతో పాటు జల సంరక్షణలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల నేతృత్వంలో అధికారుల పనితీరుకు జాతీయస్థాయిలో అవార్డు లభించింది.
మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర జల శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల జాతీయస్థాయి అవార్డు అందుకున్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ గంగాభవాని కూడా అవార్డు స్వీకారణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
5502 జల సంరక్షణ పనులు సమర్థవంతంగా చేపట్టినందుకు జాతీయస్థాయిలో ఈ అవార్డు లభించింది. నీటి సంరక్షణ కార్యక్రమాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన నెల్లూరు జిల్లాకు దేశ స్థాయిలో జల్ సంచయ్, జన్ భగీదారి 1.0 జాతీయస్థాయి అవార్డు లభించింది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన జల్ సంచయ్ జన్ భగీదారీ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసినందుకు, నీటి భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం నీటి సంరక్షణ సమర్థవంతంగా అమలు చేసిన నేపథ్యంలో సౌత్ జోన్ లో జిల్లాకు ఈ పురస్కారం లభించింది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో ఉపాధి హామీ పథకం క్రింద ఫారం పాండ్లు 856, ఇంకుడు గుంటలు 3,495, ఊట చెరువులు 112, చెక్ డ్యామ్లు 166, వాటర్ హార్వెస్టింగ్ పాండ్లు 512, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు 54, రింగ్ ట్రెంచులు 12, సరిహద్దు కందకాలు 34, నీటి నిల్వ కందకాలు 14, చెరువుల పూడికతీత పనులు 247, మొత్తం 5,502 భూగర్భ జలాల రీఛార్జ్ పనులు చేపట్టడం ద్వారా ఈ అవార్డును సాధించారు. జల్ సంచయ్ జన్ భగీదారి అంటే ప్రభుత్వ యంత్రాంగం సమష్టిగా పనిచేసి ప్రతి నీటి చుక్కను సంరక్షించడం, భవిష్య త్తు తరాల కోసం నీటి భద్రతను కాపాడడానికి నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యంగా జరిగిన ఈ కార్యక్రమాల ద్వారా వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్, నీటి కొరత నివారణ, ప్రజల్లో నీటి ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడం జరిగింది.
