
శ్రీహరికోటలో ఎస్ఎస్ఎల్వీ మూడో దశ పరీక్ష విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్ఎస్ఎల్వీ) మూడో దశ స్టాటిక్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని సాలిడ్ మోటార్ స్టాటిక్ టెస్ట్ ఫెసిలిటీలో మంగళవారం నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది ఇస్రో అభివృద్ధి చేసిన మూడు-దశల పూర్తి-ఘన ప్రయోగ వాహనం, ఇది పారిశ్రామిక ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. ఈ వాహనం ‘లాంచ్-ఆన్-డిమాండ్’ అవసరాలను తీర్చగల సామర్థ్యం కలిగి ఉందని పేర్కొంది.
మూడో దశ(ఎస్ఎస్3) ఘన మోటారు ప్రయోగ వాహనానికి 4 కి.మీ/సె వేగాన్ని అందిస్తుంది. తాజా రూపకల్పనలో కార్బన్-ఎపాక్సీతో తయారు చేసిన మోటార్ కేస్‌ను వినియోగించడంతో దశ బరువు గణనీయంగా తగ్గిందని, ఫలితంగా ఎస్ఎస్ఎల్వీ పేలోడ్ సామర్థ్యం సుమారు 90 కిలోల వరకు పెరిగిందని ఇస్రో వివరించింది. ఈ దశలో మెరుగైన ఇగ్నైటర్, నాజిల్ వ్యవస్థలను ఉపయోగించడంతో సామర్థ్యం, భద్రత మరింత పెరిగిందని తెలిపింది. నాజిల్ నియంత్రణను తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేసే, లోపాలను తట్టుకునే ఎలక్ట్రో-మెకానికల్ యాక్చ్యుయేషన్ వ్యవస్థ ద్వారా అమలు చేశామని పేర్కొంది. 108 సెకన్ల పాటు నిర్వహించిన ఈ పరీక్షలో అన్ని పరామితులు అంచనాలకు దగ్గరగా నమోదయ్యాయని, ఈ విజయంతో ఎస్ఎస్3 మోటార్‌ను విమాన ప్రయోగాల్లో వినియోగానికి అర్హత సాధించిందని ఇస్రో అధికారులు స్పష్టం చేశారు.
ఈ ఏడాది దేశంలో ఘన ఇంధన మోటార్ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు పలు సదుపాయాలను ప్రారంభించినట్లు ఇస్రో తెలిపింది. జూలై 2025లో సామర్థ్యాన్ని పెంచడానికి శ్రీహరికోటలో సాలిడ్ మోటార్ ఉత్పత్తి సౌకర్యాలను ప్రారంభించారు.ఇంకా ఘన మోటార్లకు అవసరమైన కీలకమైన పదార్ధం ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి అల్వేలోని అమ్మోనియం పెర్క్లోరేట్ ప్లాంట్‌లో అమ్మోనియం పెర్క్లోరేట్ కోసం రెండవ ఉత్పత్తి లైన్‌ను సెప్టెంబర్ 2025లో ప్రారంభించినట్లు గుర్తు చేసింది.
అదనంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఘన ఇంధన మిశ్రమ పరికరంగా గుర్తింపు పొందిన 10 టన్నుల వర్టికల్ మిక్సర్‌ను కూడా ఈ ఏడాది ఎస్డీఎస్సీలో ప్రారంభించినట్లు ఇస్రో వెల్లడించింది.
