Let's talk: editor@tmv.in
శ్రీసిటీలో క్యారియర్ భారీ పెట్టుబడి..రూ.1,000 కోట్లతో ఏసీ తయారీ యూనిట్‌కు శ్రీకారం

శ్రీసిటీలో క్యారియర్ భారీ పెట్టుబడి..రూ.1,000 కోట్లతో ఏసీ తయారీ యూనిట్‌కు శ్రీకారం

Panthagani Anusha
18 ఫిబ్రవరి, 2026

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం మరో మైలురాయిని అధిగమించింది. ప్రపంచ ప్రసిద్ధ ఎయిర్ కండీషనింగ్, రిఫ్రిజరేషన్ తయారీ సంస్థ 'క్యారియర్ రాష్ట్రంలో భారీ పెట్టుబడికి శ్రీకారం చుట్టింది. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీ వేదికగా రూ.1,000 కోట్లతో అత్యాధునిక ఏసీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సుమారు 3,000 మందికి (1,000 ప్రత్యక్ష, 2,000 పరోక్ష) ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌లతో జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. సంస్థ ప్రతినిధులు రాష్ట్రాన్ని సందర్శించిన కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే భూమి కేటాయింపు నుంచి ప్రాజెక్టు ఖరారు వరకు అన్ని ప్రక్రియలు పూర్తికావడం గమనార్హం. ఇది రాష్ట్ర ప్రభుత్వ 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానానికి నిదర్శనమని మంత్రి లోకేష్ కొనియాడారు. 39 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ యూనిట్ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ ఏసీ తయారీ హబ్‌గా మారుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అయితే ఈ తయారీ కేంద్రంలో పూర్తిగా గ్రీన్ మాన్యుఫాక్చరింగ్ పద్ధతులను అవలంబించనున్నారు. పర్యావరణ హితమైన,విద్యుత్ పొదుపు చేసే అత్యాధునిక కమర్షియల్ కూలింగ్ సొల్యూషన్ల ఉత్పత్తిపై ఈ యూనిట్ దృష్టి సారించనుంది. ప్రస్తుతం హర్యానాలో కార్యకలాపాలు సాగిస్తున్న క్యారియర్ సంస్థ దేశీయ,అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు ఏపీని తన వ్యూహాత్మక కేంద్రంగా ఎంచుకుంది.

తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సమక్షంలో క్యారియర్ ఇండియా ఎండీ సుందరేశన్ నారాయణన్, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి లీజ్ పత్రం మార్చుకున్నారు. ఈ సందర్భంగా సుందరేశన్ నారాయణన్ మాట్లాడుతూ స్థానిక యువతకు ఉపాధి కల్పించడంతో పాటు, అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీసిటీలో ఉన్న అద్భుతమైన మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు తమ నిర్ణయానికి ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు.