Let's talk: editor@tmv.in
శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Dantu Vijaya Lakshmi Prasanna
23 నవంబర్, 2025

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతోత్సవాలలో పాల్గొనేందుకు శనివారం ఉదయం 10:37 గంటలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పుట్టపర్తి చేరుకుని రాష్ట్రపతి ఘనస్వాగతం పలికారు.

అనంతరం ప్రశాంతి నిలయానికి చేరుకుని సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఆదివాసీ మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ‘శ్రీ సత్యసాయి ఆదివాసీ మహిళా స్వాస్త్య స్వశక్తీకరణ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా “శ్రీ సత్యసాయి యూనివర్సల్ టార్చ్ ఫర్ పీస్” జ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమిష్ పాండ్యా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ, 'మానవ సేవయే మాధవ సేవ' అనే నమ్మకాన్ని సత్యసాయి బాబా ప్రచారం చేశారని రాష్ట్రపతి తెలిపారు. గౌరవనీయులైన ఆధ్యాత్మిక నాయకుడు శ్రీ సత్యసాయి బాబా కోట్లాది మంది ప్రజలను సేవా మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

బాబా ఆధ్యాత్మికతను నిస్వార్థ సేవ, వ్యక్తిగత మార్పుతో ముడిపెట్టారు. సాయిబాబా కోట్లాది మందిని సేవా మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపించారు,” అని ముర్ము అన్నారు. సత్యసాయి బాబా తన అనుచరులను ఆధ్యాత్మికతను ప్రజా సంక్షేమంతో సమన్వయం చేయమని కోరారు. ఆయన భక్తులు అనేక దేశాలలో అట్టడుగు వర్గాల వారికి సేవ చేయడం సంతృప్తికరమైన విషయం అని ఆమె అన్నారు. నిస్వార్థ సేవ ద్వారా నిస్వార్థ ప్రేమ అనే శ్రీ సత్యసాయి బాబా సందేశం శ్రీ సత్యసాయి సంస్థను సేవ చేయడానికి స్వచ్ఛందంగా ప్రేరేపిస్తోందని ఆమె పేర్కొన్నారు.

"అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయి మరియు ఎల్లప్పుడూ సహాయం చేయండి, ఎప్పుడూ బాధించవద్దనే సత్యసాయి బాబా సందేశాలు శాశ్వతమైనవి, విశ్వజనీనమైనవి. ప్రపంచమే మన పాఠశాల అని, సత్యం, సద్వర్తన, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు మానవ విలువలు మన పాఠ్యాంశాలని సత్యసాయి బాబా విశ్వసించారు,” అని రాష్ట్రపతి అన్నారు.

మధ్యాహ్నం శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ యొక్క 42వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 41 సంవత్సరాలుగా, ఈ స్నాతకోత్సవం శ్రీ సత్యసాయి బాబా 98వ జయంతి వేడుకలకు ఒక రోజు ముందు నిర్వహించబడుతోంది. గత నెలలో, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు రాష్ట్రపతిని ఈ స్నాతకోత్సవానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కూడా పాల్గొన్నారు. స్నాతకోత్సవ వేదిక అయిన ప్రశాంతి నిలయంకు వెళ్లే విమానాశ్రయం రోడ్డు మార్గంతో సహా, ద్రౌపది ముర్ము పుట్టపర్తి పర్యటన కోసం సత్యసాయి జిల్లా పోలీసులు అవసరమైన భద్రతా ఏర్పాట్లు ముందుగానే చేశారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సాయిబాబా 150 వ జయంతిని రాష్ట్ర స్థాయి వేడుకగా ప్రకటించింది. నవంబర్ 20 న హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని, ఉపరాష్ట్రపతి, ఏపి సిఎమ్ చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర కేంద్రమంత్రులు,లెజండరీ క్రికెట్ దిగ్గజం సచిన్ ,సినీ నటి ఐశ్వర్య రాయ్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే.. రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురవారం (నవంబర్ 21) తిరుమల చేరుకున్నారు. శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో బస చేశారు. కాగా, అంతకు ముందు తిరుచానూరు వెళ్లి శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు దగ్గరుండి ఆమెకు స్వామివారి దర్శనం చేయించారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరిన ఆమె తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ.. శ్రీ భూ వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు.

అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సాదరంగా అహ్వానించారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. రాష్ట్రపతికి ఛైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి చిత్ర పటాన్ని, తీర్థప్రసాదాలను, టీటీడీ 2026 క్యాలెండర్, డైరీలను అందజేశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శ్రీవారిని దర్శించుకుని తిరుగు పయనంలో ఆమె రాంభకిచా వద్ద తన కాన్వాయ్‌ను ఆపించారు. ప్రోటోకాల్ పక్కనబెట్టి వాహనం దిగి, భక్తులతో కలిసి పోయారు. తిరుమల సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం భక్తులతో కరచాలనం చేసి ముచ్చటించారు. స్వయంగా భక్తులకు చాక్లెట్లు పంచారు. అయితే రాష్ట్రపతి కాన్వాయ్ నుంచి మధ్యలోనే దిగడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.

తరువాత తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు బయలుదేరారు.రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుని శనివారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రిని కలిశారు. అనతరం బేగంపేట విమానాశ్రమంలో రేవంత్ రెడ్డి వీడ్కోలు పలుకగా రాష్ట్రపతి పుట్టపర్తి చేరుకున్నారు.

శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - Tholi Paluku