
శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి
శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ మంత్రి దంపతులు తలపై పట్టువస్త్రాలను ధరించి ఆలయానికి చేరుకోగా అర్చకులు, అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు.
స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలోనూ అష్టాదశ శక్తిపీఠాలలోనూ విశిష్ట స్థానం కలిగిన శ్రీశైల క్షేత్రంలో పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యం కలగడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. మంత్రి మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శన భాగ్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను నిశితంగా పరిశీలిస్తున్నామని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు వసతులను కల్పిస్తున్నామని తెలిపారు.
మరోవైపు బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల కోసం జిల్లా యంత్రాంగం, దేవస్థానం సమన్వయంతో పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మంత్రికి వివరించారు. తాగునీరు, పారిశుధ్యం, భద్రత తదితర అంశాల్లో తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రికి నివేదించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు, ఆలయ అర్చకులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
