Let's talk: editor@tmv.in
శ్రీశైలం శాసనాల గ్రంథాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని

శ్రీశైలం శాసనాల గ్రంథాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని

Dantu Vijaya Lakshmi Prasanna
10 అక్టోబర్, 2025

శక్తి పీఠం, జ్యోతిర్లింగం ఒకేచోట కొలువై ఉన్న దివ్య క్షేత్రం శ్రీశైలం . శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్లు వెలసిన ఈ దక్షిణ కాశిని అక్టోబర్ 16 న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం వారు ప్రచురించిన "శ్రీశైల నూతన తామ్ర శాసనాలు" అనే గ్రంథాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా విడుదల చేయనున్నారు.

భారత పురావస్తు శాఖ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం సమీపంలోని ఘంటా మఠం వద్ద కనుగొన్న 21 రాగి శాసనాల సెట్‌” ను వివరిస్తూ రూపొందించిన ఈ పుస్తకం లో పలు ఆసక్తి కర విషయాలు ఉన్నాయని, ఈ శాసనాలు విజయనగర, కొండవీటి రెడ్డి రాజులు , గజపతులు, రేచర్ల నాయకులు, రాజమహేంద్రవరం రెడ్డి రాజులు , చెంగల్వ రాజవంశాలు, అలాగే కర్నూలు నవాబులకు చెందినవని , ఇవి సంస్కృతం, కన్నడ, తెలుగు, ఒడియా భాషలలో ఉన్నాయని . ఏ.ఎస్.ఐ. మైసూరు డైరెక్టర్ (ఎపిగ్రఫీ) డాక్టర్ కె. మునిరత్నం రెడ్డి తెలిపారు. ఈ శాసనాలలో నందినాగరి లిపులను ఉపయోగించినట్లు పురావస్తుశాఖ ప్రకటించింది. శ్రీశైల క్షేత్రం మహిమను చరిత్రను , ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిరక్షించి భావితరాలకు అందించడం ఓ మహా యజ్ఞం గా భారత పురావస్తు శాఖ(ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియ) వారు భావించారు.

అలాగే శ్రీశైలం లోని పంచమఠాలలో ఒకటైన ఘంటా మఠం పునరుద్ధరణ సమయంలో లభ్యమైన 21 సెట్ల తామ్ర శాసనాలను , 53 రాగి రేకులను, నాణాలను ప్రధాని తిలకించేలా ఇక్కడ మండపం లో ఒక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. శతాబ్దాల నాటి ఆలయ చరిత్రను , ఆనాటి రాజకీయ, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక,మత పరమైన పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ తామ్ర పత్రాలు ఉపకరిస్తాయని పురావస్తుశాఖ అబిప్రాయపడింది.

ఈ శాసనాలలో నమోదు చేయబడిన వివరాలు:

• రాజులు గ్రామాలకు ఇచ్చిన దానాలు.

• అన్నసత్రాల (ఉచిత భోజన శాలల) నిర్వహణ కోసం గ్రామ దానం చేసినట్టు వున్న వివరాలు.

• దేవాలయంలో ఉత్సవాల నిర్వహణ కోసం శ్రీశైలం మల్లికార్జున స్వామికి గ్రామాలను బహుమతిగా ఇవ్వడం గురించిన సమాచారం.

• ఒక తోకచుక్క మరియు దాని ఉల్కాపాతం కారణంగా ఉత్పన్నమవుతుందని ఆ విపత్తును శాంతింపజేయడానికి ఖగోళ శాస్త్రంలో నిష్ణాతుడైన ఒక వేద పండితుడికి ఒక గ్రామాన్ని బహుమతిగా ఇవ్వడం జరిగినది అనే సమాచారం.

• శ్రీశైలం మరియు మల్లేశ్వరం దేవాలయాల అర్చకులకు చేసిన దానాలను పునరుద్ధరించడం.

సంక్షిప్త సారాంశం:

• రేచర్ల నాయకుల కాలానికి చెందిన లింగమ నాయక రాజు యొక్క ఒక శాసనం ప్రకారం, తురుష్కులు ఆక్రమించిన ప్రాంతాలపై తిరిగి నియంత్రణ సాధించిన తరువాత, రేచర్ల లింగమ నాయకుడు అక్కడ ఉన్న ఎనిమిది అగ్రహారాలను పునరుద్ధరించారు.

• వీటితో పాటు రేగదేవులపల్లి, ఉగ్గులపల్లి మరియు గణపురం గ్రామాలలో కొన్ని వృత్తుల వారు వారి భూమిని మహేశ్వరం శ్రీ మహేశ్వరదేవునికి దానంగా ఇచ్చారు.

• తురుష్కుల ఆక్రమణ కారణంగా శ్రీశైలం ఆలయానికి సంబంధించిన వివిధ సేవలు నిలిచిపోయాయి, రాజు ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత వాటిని పునరుద్ధరించారు.

• నాగరి లిపిలో లభించిన మరొక రాగి శాసనం అసంపూర్ణంగా ఉంది. ఇందులో భరద్వాజ, ఆత్రేయ, గౌతమ మరియు కౌశిక గోత్రాలకు చెందిన, వేదాలు మరియు వేదాంగాలలో నిష్ణాతులైన పలువురు బ్రాహ్మణులకు 16 వృత్తులను పంపిణీ చేసినట్లు నమోదు చేయబడినట్లు తెలుస్తోంది. ఈ శాసనం ప్రకారం, చెక్కడానికి సహాయం చేసినవారికి రెండు వృత్తులు, మరియు కూర్చిన వ్యక్తికి ఒక వృత్తి దానంగా ఇచ్చారు.

ప్రస్తుతం శ్రీశైలం లో ఆలయ పునరుద్ధరణ పనులు:

శివుని ఆశీస్సులతో, లార్డ్ వెంకటేశ్వర ఛారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్, పూణే వారిచే ప్రాచీన సంరక్షణ పద్ధతులను అనుసరించి, మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని ఘంటామఠం, విభూదిమఠం మరియు రుద్రాక్షమఠం పైకప్పులపై ఉన్న ఆధునిక కాంక్రీట్‌ను తొలగించి, అసలు నిర్మాణాన్ని వెలికితీసే పనిని ప్రారంభించారు. తదుపరి పనులు పురోగతిలో ఉన్నాయి.ఈ సందర్బంగా అన్ని దేవాలయ అధికారులకు పురావస్తు శాఖ వారు ఒక విజ్ఞప్తి చేశారు.

• వారసత్వ నిపుణులను సంప్రదించకుండా ఏ పురాతన దేవాలయాల పైకప్పులపై కాంక్రీట్‌ను ఉపయోగించవద్దని కోరడమైనది.

• తమ దేవాలయాలకు సంబంధించి ఏదైనా పునరుద్ధరణ/సంరక్షణ పనులు చేపట్టే ముందు, భారత పురావస్తు శాఖ (Archaeological Survey of India) యొక్క వారసత్వ నిపుణులను తప్పనిసరిగా సంప్రదించాలని దేవాలయ అధికారులకు తెలియజేశారు.

శ్రీశైలం శాసనాల గ్రంథాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని - Tholi Paluku