Let's talk: editor@tmv.in
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్ రెడ్డి

శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
4 నవంబర్, 2025

రెండు దశాబ్దాల కాలం పాటు నిలిచిపోయిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌ ప్రాజెక్టును ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి చేపట్టాం. ఆ క్రమంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మిగిలిపోయిన 9.8 కిలోమీటర్ల పనుల పూర్తి చేసి తీరుతాం అని సీఎం పేర్కొన్నారు.

నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం శ్రీశైలం ఎడమగట్టు కాలువ ( ఎస్ఎల్‌బీసీ) ప్రాజెక్టు టన్నెల్ పనులను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే కార్యక్రమం మన్నెవారిపల్లిలో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా మంత్రులు ఉత్త‌మ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వంశీచంద్రరెడ్డి, బాలు నాయక్, నీటి పారుదల శాఖ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, సిఎస్‌ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రకాశ్ కుమార్, శాస్త్రవేత్త డా. హెచ్‌వీఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

3.3 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం..!

ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు లక్ష్యం తెలంగాణ దక్షిణ జిల్లాలైన నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ ప్రాంతాలకు సాగునీరు అందించడం. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సుమారు 3.3 లక్షల ఎకరాల ఎండబడ్డ భూములకు నీటి సౌకర్యం కల్పించబడుతుందని తెలిపారు. దీని ద్వారా వ్యవసాయోత్పత్తి పెరుగుదలతో పాటు భూగర్భ జలస్థాయిలు కూడా మెరుగుపడతాయని సీఎం తెలిపారు.

టన్నెల్ నిర్మాణం — లోతు, పొడవు వివరాలు

ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టులో రెండు ప్రధాన టన్నెల్‌లు ఉన్నాయి.టన్నెల్–1, 13 కిలోమీటర్లు పొడవు,టన్నెల్–2, 30 కిలోమీటర్లు పొడవు ఇవి కలిపి మొత్తం 43 కిలోమీటర్ల భూగర్భ మార్గం. ఈ టన్నెల్‌లు సగటున 800 నుంచి 1000 మీటర్ల లోతులో తవ్వబడుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 70 శాతం (సుమారు 30 కిలోమీటర్లు) పనులు పూర్తయ్యాయి. ప్రపంచంలోనే మరెక్కడా లేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు మంచి పేరు రావడమే కాకుండా నయా పైసా ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటిని సరఫరా చేయొచ్చు. ప్రస్తుతం ఏఎంఆర్ ప్రాజెక్టు ద్వారా తరలిస్తున్న నీటికి కేవలం విద్యుత్ చార్జీల కోసం ఏటా 500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. గడిచిన పదేండ్లలో కేవలం విద్యుత్ చార్జీలే 5 వేల కోట్లు చెల్లించామ‌ని పేర్కొన్నారు.

పనులు ఎందుకు ఆగిపోయాయి?

2013–14లో టన్నెల్‌ పనులు భూగర్భ సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయాయి.టన్నెల్ తవ్వకాల సమయంలో “షియర్ జోన్” అనే బలహీన రాతి పొరలు ఎదురవ్వడం,నీటి ప్రవాహం అధికంగా ఉండటం,భద్రతా సమస్యలు పెరగడం,నిధుల కొరత, కాంట్రాక్టర్ మార్పులు వంటి అంశాల వల్ల తవ్వకాలు నిలిచిపోయాయి.ఈ సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు హెలిబోర్న్ సర్వే ప్రారంభమైంది. ఇది పూర్తయిన తర్వాత టన్నెల్ తవ్వకాలకు శాస్త్రీయ మార్గం ఏర్పడనుంది.

హెలిబోర్న్ సర్వే ఎలా ఉపయోగపడుతుంది?

హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే ద్వారా భూగర్భంలోని రాతి పొరలు, నీటి ప్రవాహ దిశలు, ఒత్తిడి, బలహీన ప్రాంతాలు స్పష్టంగా గుర్తించవచ్చు.దీని ద్వారా ఇంజినీర్లు టన్నెల్ నిర్మాణ వ్యూహాన్ని సురక్షితంగా రూపకల్పన చేయగలరు.అలాగే ప్రమాద ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగిన రక్షణ చర్యలు చేపట్టవచ్చు.అందువల్ల ఈ సర్వే టన్నెల్ తవ్వకాలకు శాస్త్రీయ దిశానిర్దేశం ఇచ్చే పునాది దశగా భావిస్తున్నారు.

వ్యయం, కాలపరిమితి

ప్రాజెక్టు మొదట 2004 నుంచి 05లో మంజూరు చేయబడినప్పుడు మొత్తం అంచనా వ్యయం రూ.1,975 కోట్లు, అందులో టన్నెల్ పనులకు రూ.900 కోట్లు కేటాయించబడింది. అయితే సాంకేతిక అడ్డంకులు, ఆలస్యం కారణంగా ఇప్పుడు వ్యయం రూ. 2,500 కోట్లు దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రస్తుత లక్ష్యం ప్రకారం 2027 చివరి నాటికి టన్నెల్ పనులు పూర్తిచేయడం సాగునీరు అందిచేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టానుంది.

శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్ రెడ్డి - Tholi Paluku