Let's talk: editor@tmv.in
శ్రీవారి సన్నిధిలో రాజకీయ ప్రచారం: బాధ్యులపై కేసు నమోదు

శ్రీవారి సన్నిధిలో రాజకీయ ప్రచారం: బాధ్యులపై కేసు నమోదు

Panthagani Anusha
20 డిసెంబర్, 2025

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో రాజకీయ ప్రచారానికి పాల్పడిన ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్రంగా స్పందించింది. ఆలయ నిబంధనలను ఉల్లంఘిస్తూ తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు రాజకీయ ఫ్లెక్స్ బ్యానర్లు ప్రదర్శించడంతో వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు టీటీడీ వెల్లడించింది.

కాగా డిసెంబరు 16న శ్రీవారి ఆలయం సమీపంలో గజా మురుగన్‌, బాలమురుగన్‌ అనే ఇద్దరు యువకులు ఏఐఏడీఎంకే నేతల ఫోటోలతో కూడిన ఫ్లెక్స్ బ్యానర్‌ను ప్రదర్శించినట్లు పోలీసులు తెలిపారు. ఆ బ్యానర్‌లో “శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అధికారంలోకి వస్తుంది అనే సందేశంతో పాటు పార్టీ నేత ఎడప్పాడి కె.పళనిస్వామి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత చిత్రాలు ఉన్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బ్యానర్ ప్రదర్శించిన అనంతరం రీల్స్‌ చిత్రీకరించి సోషల్ మీడియా వేదికలపై ప్రచారం చేసినట్లు టీటీడీ గుర్తించింది.

ఈ వ్యవహారంపై స్పందించిన టీటీడీ, తిరుమలలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు అనుమతి లేదని మరోసారి స్పష్టం చేసింది. ఆలయ పవిత్రత, ప్రశాంత వాతావరణాన్ని పరిరక్షించేందుకు రూపొందించిన నిబంధనల ప్రకారం ఆలయ పరిసరాల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు రాజకీయ ప్రచారం పూర్తిగా నిషేధమని పేర్కొంది.

ఆలయ పరిసరాల్లో రాజకీయ బ్యానర్లు ప్రదర్శించడం టీటీడీ నిబంధనలకు తీవ్రమైన ఉల్లంఘన. సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని టీటీడీ అధికారిక ప్రకటనలో తెలిపింది. తిరుమల వాతావరణాన్ని భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా సహించబోమని హెచ్చరించింది.

ఇక టీటీడీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్ 223 (ప్రభుత్వాధికారుల చట్టబద్ధ ఆదేశాలను ఉల్లంఘించడం), 299 (మతపరమైన భావాలను అవమానపరిచే ఉద్దేశపూర్వక చర్యలు), 270 (ప్రజలకు అవాంతరం, అశాంతి కలిగించే చర్యలు)తో పాటు, సామూహిక ఉద్దేశ్యంపై ఆధారపడిన సెక్షన్ 3(5) కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

తిరుమలలో రాజకీయాలకు తావులేదని టీటీడీ ఇప్పటికే పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కొందరు వ్యక్తులు పదేపదే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తాం అని కేసు దర్యాప్తు అధికారి పోలీసు అధికారి తెలిపారు.

రాజకీయ ప్రకటనలపై నిషేధం (2024)

ఇదే తొలిసారి కాదు తిరుమలలో రాజకీయ కార్యకలాపాలపై గతంలోనూ పలుమార్లు నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. దర్శనం అనంతరం ఆలయ పరిసరాల్లో రాజకీయ వ్యాఖ్యలు చేయడం, వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి ఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 2024లో టీటీడీ తిరుమలలో రాజకీయ ప్రసంగాలు, ప్రకటనలు, ప్రచారాలను పూర్తిగా నిషేధిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినప్పటికీ, కొందరు వ్యక్తులు పదే పదే నిబంధనలను అతిక్రమిస్తున్నారని టీటీడీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యేపై కేసు (2025)

దర్శనం అనంతరం ఆలయ బయట రాజకీయ వ్యాఖ్యలు చేసిన ఓ మాజీ ఎమ్మెల్యేపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ ఆదేశాలను ఉల్లంఘించినందుకు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 కింద చర్యలు తీసుకున్నారు.

శ్రీవారి సన్నిధిలో రాజకీయ ప్రచారం: బాధ్యులపై కేసు నమోదు - Tholi Paluku