Let's talk: editor@tmv.in
శ్రీవారి లడ్డూ ప్రసాదానికి నెయ్యి కొరత లేదు: టీటీడీ

శ్రీవారి లడ్డూ ప్రసాదానికి నెయ్యి కొరత లేదు: టీటీడీ

Panthagani Anusha
11 మార్చి, 2026

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి నిల్వలు టీటీడీ వద్ద సమృద్ధిగా ఉన్నాయని దేవస్థానం ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. గత కొద్దిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో లడ్డూ తయారీకి నెయ్యి కొరత ఏర్పడిందని ప్రసాదాల పంపిణీలో అంతరాయం కలుగుతోందని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం సరికాదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

శ్రీవారి లడ్డూ తయారీకి అవసరమైన నెయ్యి సేకరణలో టీటీడీ అత్యంత పారదర్శకమైన పటిష్టమైన ‘మూడంచెల కొనుగోలు విధానాన్ని’ అనుసరిస్తోంది. కేవలం ఒకే సంస్థపై ఆధారపడకుండా మూడు వేర్వేరు ప్రముఖ డైరీ సంస్థల నుంచి నెయ్యిని సేకరిస్తున్నారు. దీనివల్ల ఏదైనా ఒక సంస్థ నుండి సరఫరాలో సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా మిగిలిన రెండు సంస్థల ద్వారా నిరంతరాయంగా నెయ్యి అందుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ముందస్తు జాగ్రత్తల వల్ల సరఫరా విషయంలో ఎక్కడా అంతరాయం కలగడానికి ఆస్కారం లేదు అని భరోసా ఇచ్చారు.

కాగా ఇటీవల ఇందాపూర్ డైరీకి చెందిన ఒక నెయ్యి ట్యాంకర్ కడప జిల్లా కొండాపూర్ సమీపంలో ప్రమాదానికి గురైన మాట వాస్తవమేనని అయితే ఆ ఒక్క ట్యాంకర్ రాకపోయినంత మాత్రాన లడ్డూ తయారీకి వచ్చిన ముప్పేమీ లేదని టీటీడీ వెల్లడించింది. మిగిలిన రెండు సంస్థల నుంచి సరఫరా యథావిధిగా సాగుతోందని పేర్కొంది. ప్రస్తుతానికి భక్తుల అవసరాల కోసం సుమారు 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్‌గా సిద్ధంగా ఉన్నాయని ఎక్కడా పంపిణీ ఆగలేదని స్పష్టం చేసింది.

మరోవైపు త్వరలో ప్రారంభం కానున్న వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో, టీటీడీ ఇప్పటికే అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసింది. లడ్డూలు తయారు చేసే ‘పోటు’ విభాగంలో యంత్రాలు, కన్వేయర్ బెల్టులు ఇతర సాంకేతిక పరికరాలకు ఎప్పటికప్పుడు మరమ్మత్తులు నిర్వహిస్తూ అవి సజావుగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని భక్తులకు లడ్డూల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.

అదేవిధంగా శ్రీవారి కైంకర్యాలకు గానీ లడ్డూ ప్రసాదాల తయారీకి గానీ ఎలాంటి ఆటంకం కలగలేదు. భక్తులు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దు అని టీటీడీ విజ్ఞప్తి చేసింది. స్వామివారి సేవలో ఎక్కడా రాజీ పడకుండా అత్యంత నాణ్యమైన ప్రసాదాలను భక్తులకు అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యతని దేవస్థానం పునరుద్ఘాటించింది.

శ్రీవారి లడ్డూ ప్రసాదానికి నెయ్యి కొరత లేదు: టీటీడీ - Tholi Paluku