Let's talk: editor@tmv.in
శ్రీవారి లడ్డూ అపచారానికి 'ప్రాయశ్చిత్తం': నెల్లూరులో జనసేన నేత పొర్లుదండాలు

శ్రీవారి లడ్డూ అపచారానికి 'ప్రాయశ్చిత్తం': నెల్లూరులో జనసేన నేత పొర్లుదండాలు

Panthagani Anusha
15 ఫిబ్రవరి, 2026

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో నెల్లూరులో ఆధ్యాత్మిక నిరసన మిన్నంటింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్న ఈ ఘటనకు ప్రాయశ్చిత్తంగా జనసేన జిల్లా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ శనివారం ఉదయం నెల్లూరు నగరంలో భారీ పొర్లుదండాల కార్యక్రమం చేపట్టారు.

ఉదయం 8 గంటలకు స్థానిక రాజరాజేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆయన తన దీక్షను ప్రారంభించారు. అక్కడి నుండి మాగుంట లేఅవుట్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు సుమారు 4.5 కిలోమీటర్ల మేర కఠినమైన పొర్లుదండాలు పెడుతూ ముందుకు సాగారు. దారిపొడవునా వందలాది మంది జనసైనికులు, వీరమహిళలు, భక్తులు 'గోవింద నామ' స్మరణతో ఆయనకు తోడయ్యారు.

ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ సనాతన ధర్మానికి ముప్పు వాటిల్లినప్పుడు మౌనంగా ఉండటం తగదని పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో భాగంగానే ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టానని తెలిపారు. అపచారానికి పాల్పడిన వారికి శిక్ష పడాలని భవిష్యత్తులో ధర్మ రక్షణకు జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ బృహత్తర కార్యక్రమం భక్తుల జయజయధ్వానాల మధ్య దిగ్విజయంగా ముగిసింది.