Let's talk: editor@tmv.in
శ్రీవారి ప్రసాదాలపై హైటెక్ నిఘా: రూ. 25 కోట్లతో స్టేట్ ఫుడ్ ల్యాబ్.. నేడు ప్రారంభించనున్న సీఎం

శ్రీవారి ప్రసాదాలపై హైటెక్ నిఘా: రూ. 25 కోట్లతో స్టేట్ ఫుడ్ ల్యాబ్.. నేడు ప్రారంభించనున్న సీఎం

Panthagani Anusha
21 మార్చి, 2026

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసాదాల నాణ్యత విషయంలో భక్తుల నమ్మకాన్ని మరింత ఇనుమడింప జేస్తూ తిరుమలలో నిర్మించిన అత్యాధునిక 'రాష్ట్ర ఆహార ప్రయోగశాల' శనివారం ప్రారంభం కానుంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఈ ప్రయోగశాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలలో ప్రసాదాల తయారీలో పారదర్శకతను పెంచేందుకు ఈ ల్యాబ్ కీలక భూమిక పోషించనుంది.

దేశంలోనే మొట్టమొదటి సారిగా

భారతదేశంలోని మరే ఇతర పుణ్యక్షేత్రంలో లేని విధంగా కేవలం ఆలయ ప్రసాదాలు ముడి సరుకుల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు ఇంతటి భారీ స్థాయి ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. సుమారు 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 25 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాన్ని నిర్మించారు. టీటీడీ కేటాయించగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం నిధులను మంజూరు చేసింది. గత ఏడాది జూన్ 1న ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఆగస్టు 8, 2024న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం మేరకు శరవేగంగా పూర్తయింది.

అధునాతన టెక్నాలజీ: ఈ-టంగ్, ఈ-నోస్ ప్రత్యేకత

శ్రీవారి లడ్డూ, అన్న ప్రసాదాల రుచి, సువాసనలలో వచ్చే అతి సూక్ష్మమైన మార్పులను కూడా గుర్తించేందుకు ఈ ల్యాబ్‌లో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఫ్రాన్స్ దేశం నుండి సుమారు రూ. 3 కోట్ల వ్యయంతో తెప్పించిన 'ఈ-టంగ్' 'ఈ-నోస్' వ్యవస్థలు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇవి కృత్రిమ మేధస్సుతో పనిచేస్తూ రుచి, వాసనలోని వ్యత్యాసాలను ఇట్టే పట్టేస్తారు. దీనివల్ల ప్రసాదాల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత ప్రమాణాలను పాటించే అవకాశం కలుగుతుంది.

50 రకాల పారామీటర్లతో కఠిన తనిఖీలు

మొత్తం 50కి పైగా అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ ల్యాబ్‌లో ప్రతి నమూనాను 50 విభిన్న అంశాల ఆధారంగా విశ్లేషిస్తారు. నెయ్యి, నూనె, పాలు, జీడిపప్పు, కిస్‌మిస్, బాదం, యాలకులు, శనగపప్పు, చక్కెర, పసుపు, మిరప పొడి వంటి ముడి సరుకులను క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ముఖ్యంగా నెయ్యి, నూనెలలో కల్తీ ఉందా? జంతువుల కొవ్వు లేదా ఇతర వృక్ష సంబంధిత నూనెలు కలిసాయా? అనే అంశాన్ని కచ్చితత్వంతో నిర్ధారిస్తారు. పురుగుమందుల అవశేషాలు, ప్రిజర్వేటివ్‌లు,సూక్ష్మజీవుల ఉనికిని రసాయన, మైక్రోబయాలజీ పరీక్షల ద్వారా గుర్తిస్తారు.

భక్తుల నమ్మకమే పరమావధి

ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయమైన తిరుమల ప్రతిష్టను, ప్రసాదాల పవిత్రతను కాపాడటంలో ఈ స్టేట్ ఫుడ్ ల్యాబ్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. 1981లో ఏర్పాటు చేసిన పాత ల్యాబ్‌లో కేవలం ప్రాథమిక పరీక్షలు మాత్రమే జరిగేవి. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త ప్రయోగశాల ద్వారా భక్తులకు అందే ప్రసాదాల నాణ్యతపై ఎటువంటి సందేహాలకు తావు లేకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందని ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

శ్రీవారి ప్రసాదాలపై హైటెక్ నిఘా: రూ. 25 కోట్లతో స్టేట్ ఫుడ్ ల్యాబ్.. నేడు ప్రారంభించనున్న సీఎం - Tholi Paluku