Let's talk: editor@tmv.in
శ్రీవారి ప్రసాదం పై అభాండాలు ఇక చాలు: వైసీపీ

శ్రీవారి ప్రసాదం పై అభాండాలు ఇక చాలు: వైసీపీ

Panthagani Anusha
31 జనవరి, 2026

కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం చుట్టూ నెలల తరబడి సాగుతున్న వివాదానికి సీబీఐ దర్యాప్తుతో ఒక కీలక ముగింపు లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) 15 నెలల సుదీర్ఘ విచారణ అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జిషీట్‌ను సమర్పించింది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిశారన్న ఆరోపణలు నిరాధారమని తేల్చిన సీబీఐ అదే సమయంలో నెయ్యి సరఫరాలో జరిగిన రూ. 250 కోట్ల భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేసింది.

జంతు కొవ్వు ఆరోపణలు అవాస్తవం

ఛార్జిషీట్‌లోని అత్యంత కీలక అంశం ఏమిటంటే.. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు, పంది కొవ్వు లేదా చేప నూనె వాడినట్లు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదు. గత ప్రభుత్వ హయాంలో జంతు కొవ్వు వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై జాతీయ స్థాయి ప్రయోగశాలల్లో జరిపిన పరీక్షలు ప్రతికూల ఫలితాలను ఇచ్చాయి. దీంతో భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిన 'జంతు కొవ్వు' వివాదానికి శాస్త్రీయంగా తెరపడినట్లయింది. ఈ పరిణామంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆర్కే రోజా, కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ.. ఇది చంద్రబాబు శిబిరం సృష్టించిన రాజకీయ అబద్ధమని, నివేదికతో ఆయనకు చెంపదెబ్బ తగిలిందని విమర్శించారు.

నెయ్యి ముసుగులో పామాయిల్ మాయాజాలం

జంతు కొవ్వు లేదని తేలినప్పటికీ టీటీడీకి సరఫరా అయిన నెయ్యిలో భారీస్థాయిలో కల్తీ జరిగినట్లు సీబీఐ నిర్ధారించింది. అసలైన ఆవు నెయ్యికి బదులుగా రసాయనికంగా ప్రాసెస్ చేసిన పామాయిల్, పామ్‌కెర్నల్ ఆయిల్ కలిపిన పదార్థాన్ని 'నెయ్యి'గా విక్రయించినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. 2019-2024 మధ్య కాలంలో దాదాపు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా గొలుసులోకి ప్రవేశించిందని ఇందుకు సంబంధించి నకిలీ ల్యాబ్ రిపోర్టులు, తప్పుడు పత్రాలను సృష్టించారని అధికారులు గుర్తించారు. డెయిరీ నిపుణులు, సరఫరాదారులు కుమ్మక్కై ఈ ఆర్థిక దోపిడీకి పాల్పడినట్లు తేలింది.

నిందితుల జాబితాలో అధికారులు, డెయిరీ ప్రతినిధులు

ఈ కేసులో మొత్తం 36 మందిని సీబీఐ నిందితులుగా పేర్కొంది. వీరిలో తొమ్మిది మంది టీటీడీ అధికారులు, ఐదుగురు డెయిరీ నిపుణులు ఉండటం గమనార్హం. ఉత్తరాఖండ్‌కు చెందిన భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్ ఈ కుంభకోణానికి ప్రధాన సూత్రధారులుగా ఉన్నారని సీబీఐ స్పష్టం చేసింది. నిందితుల జాబితాలో టీటీడీ మాజీ జీఎంలు సుబ్రహ్మణ్యం, మురళీకృష్ణలతో పాటు వైష్ణవి, ఏఆర్ డెయిరీ ప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డిలను విచారించినప్పటికీ వారిని నిందితులుగా చేర్చలేదు.

రాజకీయ సమరం.. కోర్టులోకి వివాదం

సీబీఐ నివేదిక బయటకు రాగానే రాష్ట్రంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. టీడీపీ నాయకురాలు జి. అనురాధ స్పందిస్తూ.. లడ్డూలో కల్తీ జరిగిందని సిట్ నిరూపించిందని గత ప్రభుత్వ పాపాలను కడిగే పనిలో తమ ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు, తమపై వచ్చిన ఆరోపణలు తప్పని తేలినందున హైకోర్టును ఆశ్రయిస్తామని వైఎస్సార్‌సీపీ నేత మనోహర్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో 'నింద పరిహార హోమం' నిర్వహించగా ఇప్పుడు సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా ఇరు పక్షాలు చట్టపరమైన నైతిక పోరాటానికి సిద్ధమవుతున్నాయి.

శ్రీవారి ప్రసాదం పై అభాండాలు ఇక చాలు: వైసీపీ - Tholi Paluku