
శ్రీవారి ఆలయానికి పాట్నాలో పదెకరాలు
దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తి విస్తరణలో భాగంగా మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తర భారత భక్తులకు శ్రీవారి సేవలు చేరువయ్యేలా బీహార్ ప్రభుత్వం పాట్నాలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణానికి అవసరమైన 10.11 ఎకరాల భూమిని అధికారికంగా కేటాయించింది.
కాగా పాట్నా నగరంలోని మోకామా ఖాస్ ప్రాంతంలో ఉన్న భూమిని శ్రీవారి ఆలయ నిర్మాణానికి కేటాయిస్తున్నట్లు బీహార్ ప్రధాన కార్యదర్శి ప్రతయ అమృత్, ఐఏఎస్, టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడుకు లేఖ పంపారు. ఈ భూమిని 99 సంవత్సరాలపాటు కేవలం రూ.1 టోకెన్ లీజు పై ఇవ్వాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హెచ్‌ఆర్‌డి శాఖ మంత్రి నారా లోకేశ్‌లు కూడా బీహార్ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణం ఉత్తర భారత భక్తులకు పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారనున్నదని పేర్కొన్నారు.
టిటిడి దేశంలోని పలు రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ, జమ్మూ ప్రాంతాల్లో ఇప్పటికే నిర్మించిన ఆలయాల తరహాలోనే, ఉత్తర భారత కేంద్రంగా నిలిచే పాట్నాలో ఆలయ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని టిటిడి భావిస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా బీహార్ అధికారులతో జరిగిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయని అధికారులు తెలిపారు.
అవసరమైన తదుపరి చర్యలను వేగవంతం చేయడానికి, బీహార్ ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్‌నుకూడా నియమించింది. కాగా టిటిడి ప్రతినిధి బృందం త్వరలోనే ఆయనతో భేటీ కానుంది. ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూసర్వే, డిజైన్లు, కార్యాచరణ ప్రణాళిక వంటి అంశాలను దశలవారీగా ముందుకు తీసుకెళ్లాలని టిటిడి భావిస్తోంది.
బీహార్ ప్రభుత్వ నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ, “పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణం ఉత్తర భారత భక్తులకు ఆధ్యాత్మిక ఆధారంగా నిలుస్తుంది. బీహార్ ప్రభుత్వం చూపిన సహకారం అభినందనీయం” అని పేర్కొన్నారు.
పాట్నాలో శ్రీవారి ఆలయం ఏర్పడితే
బీహార్, జార్ఖండ్, బెంగాల్ ప్రాంతాల కోట్లాది భక్తులకు శ్రీవారి దర్శనం అందరికీ చేరుకోవడంతో పాటు స్థానిక పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. దీనికి తోడు టిటిడి ధార్మిక కార్యకలాపాలు ఉత్తర భారతంలో అభివృద్ధి చెందడం వంటి ప్రయోజనాలు కలుగనున్నాయని అధికారులు భావిస్తున్నారు.
