Let's talk: editor@tmv.in
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి

Gaddamidi Naveen
4 ఏప్రిల్, 2026

తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారుల మర్యాదల నడుమ స్వామి వారిని దర్శించుకున్న ఆయన, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇటీవల మార్చి 31న, డీజీపీ శివధర్ రెడ్డి అడవిలో ఉన్న మావోయిస్టులకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. హింసా మార్గాన్ని వీడి, సమాజ ప్రధాన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గతంలో చేసిన విన్నపాన్ని గుర్తు చేస్తూ.. అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్ నుంచి బయటకు వచ్చి తమ కుటుంబాలతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు.

గత రెండేళ్లలో తెలంగాణ పోలీసుల కృషి ఫలితంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన 721 మంది మావోయిస్టులు లొంగిపోయి ప్రధాన స్రవంతిలో చేరినట్లు డీజీపీ తెలిపారు. వీరిలో నలుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు, 19 మంది స్టేట్ కమిటీ సభ్యులు, 36 మంది డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారని వెల్లడించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం, ఇతర సౌకర్యాలు అందిస్తూ వారి గ్రామాల్లో గౌరవప్రద జీవితం గడపడానికి సహకరిస్తోందని పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాల్లో క్రియాశీలకంగా ఉన్న తెలంగాణ వాసులు.. ముఖ్యంగా ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి (72), సంతోష్, సుజాత వంటి నేతలు తిరిగి రావాలని డీజీపీ కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తున్న గణపతికి హైదరాబాద్‌లో అత్యాధునిక వైద్య చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. మార్చి 7న 130 మంది మావోయిస్టులు లొంగిపోయినప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా గణపతికి చేసిన విన్నపాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో హింస వల్ల ఎలాంటి పరిష్కారం లభించదని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న వారి కుటుంబ సభ్యులు కూడా వారిని శాంతి మార్గంలోకి మళ్లించేలా కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆయన కోరారు.