Let's talk: editor@tmv.in
శ్రీలంక చెర నుంచి విముక్తి.. స్వదేశానికి 30 మంది మత్స్యకారుల రాక

శ్రీలంక చెర నుంచి విముక్తి.. స్వదేశానికి 30 మంది మత్స్యకారుల రాక

Shaik Mohammad Shaffee
8 ఏప్రిల్, 2026

పొట్టకూటి కోసం సముద్ర వేటకు వెళ్లి శ్రీలంక నౌకాదళానికి చిక్కిన 30 మంది భారతీయ మత్స్యకారులు మంగళవారం సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో 21 మంది తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన వారు కాగా, మరో 9 మంది పుదుచ్చేరిలోని కారైకాల్ ప్రాంతానికి చెందిన వారు. ఫిబ్రవరి 15న నాగపట్టణం, మయిలాడుతురై, కారైకాల్ ప్రాంతాల నుంచి రెండు పడవల్లో వేటకు వెళ్లిన వీరు.. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను దాటారన్న ఆరోపణలతో లంక నేవీకి చిక్కారు.

దౌత్య పోరాటం ఫలించింది

మత్స్యకారుల అరెస్టు అనంతరం వారిని శ్రీలంకలోని మల్లాకం కోర్టులో ప్రవేశపెట్టి, జాఫ్నా జైలుకు తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాలు వారి విడుదల కోసం తీవ్రస్థాయిలో దౌత్య ప్రయత్నాలు ప్రారంభించాయి. వీరికి తోడుగా పుదుచ్చేరికి చెందిన ఎల్‌జేకే నేత చార్లెస్ మార్టిన్ న్యాయవాదుల ద్వారా చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ ఉమ్మడి కృషితో మార్చి 31న శ్రీలంక ప్రభుత్వం మత్స్యకారులందరినీ విడుదల చేసింది. అనంతరం కొలంబోలోని భారత హైకమిషన్ అధికారులకు వారిని అప్పగించారు.

భావోద్వేగాల మధ్య స్వాగతం

కొలంబోలో వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని, అత్యవసర ప్రయాణ పత్రాలు పొందిన మత్స్యకారులు విమానంలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ లాంఛనాలు పూర్తి కాగానే మత్స్యశాఖ అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారిని ప్రత్యేక వాహనాల్లో వారి సొంత ఊర్లకు తరలించారు. నెల రోజులకు పైగా జైలు జీవితం గడిపి, ప్రాణాలతో తిరిగి వచ్చిన తమ వారిని చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు.

‘సమస్యకు పరిష్కారం ఆర్థికాంశాల్లోనే ఉంది’

ఇరు దేశాల మధ్య మత్స్యకారుల అరెస్టుల వ్యవహారం ఏళ్ల తరబడి సాగుతున్న తలనొప్పి అని, దీనిని కేవలం చట్టాలతోనో లేదా రాజకీయాలతోనో పరిష్కరించలేమని శ్రీలంక ఎంపీ హర్ష డి సిల్వా అభిప్రాయపడ్డారు. రెండు వైపులా ఉన్న వేలాది కుటుంబాలు కేవలం చేపల వేటపైనే ఆధారపడి బతుకుతున్నాయని, అందుకే ఇది ఒక ఆర్థిక సమస్య అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా భారీ బోట్లు (ట్రాలర్లు) వందల సంఖ్యలో వచ్చి సముద్ర గర్భాన్ని తోడేయడం వల్ల సముద్ర సంపద అంతరించిపోతోందని లంక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సముద్రంలో కేవలం సరిహద్దు గీతలు గీసినంత మాత్రాన ఈ గొడవలు ఆగిపోవని, ఇరు దేశాల మత్స్యకారుల పొట్ట నిండేలా ఒక పక్కా ఆర్థిక ప్రణాళికను రూపొందించినప్పుడే దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆయన స్పష్టం చేశారు.